ఆదిలాబాద్ జిల్లా : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక రంగానికి కేరాఫ్ మారుస్తామని అన్నారు. జిల్లాలోని బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఏర్పాటుచేసిన “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ” బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకనాడు ఈ ప్రాంతం నుండే ప్రజా సమస్యల పై ఆత్మగౌరవ గిరిజన దండోరా మోగించానని చెప్పారు. నియంత పాలన పై కొమురం భీం స్ఫూర్తిగా పోరాడానని అన్నారు సీఎం. ఇప్పుడు ఇదే గడ్డ పై ప్రజా సమస్యల పరిష్కారం, ఉమ్మడి జిల్లా అభివృద్ధికి బాటలు వేయడం సంతోషంగా ఉందన్నారు.
ఆదిలాబాద్ ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని, ఇందు కోసం ఎన్ని నిధులనైనా ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు సీఎం. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహితకు తిరిగి ప్రాణం పోస్తాం అన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేయడం లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు.
ఎన్నికల వరకే రాజకీయం అని, పరిపాలనలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం మా సిద్ధాంతం అని అన్నారు. ప్రతిపక్ష శాసన సభ్యులు ఉన్న నియోజకవర్గాల్లో సైతం యంగ్ ఇండియా స్కూళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సుహృద్భావ రాజకీయం గత పాలనలో లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి కలిసి వస్తున్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియ చేస్తున్నట్లు చెప్పారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


















