అమరావతి : ఏపీ కూటమి సర్కార్ సంచలన ప్రకటన చేసింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు దివ్యాంగుల కోసం. బుధవారం రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ , మంత్రి నారా లోకేష్ ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘దివ్యాంగ శక్తి’ పథకం ఘనంగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ఈ సందర్బంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
మంగళగిరి బస్టాండ్, డాన్ బాస్కో స్కూల్, డోలాస్ నగర్, ప్రకాశ్ నగర్, నులకపేట, ఉండవల్లి సెంటర్, పెనుమాక వరకు సుమారు 11 కిలోమీటర్ల మేర ప్రయాణం కొనసాగింది. ప్రయాణం సందర్భంగా దివ్యాంగుల సమస్యలు, వారి రోజువారీ సవాళ్లు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై నాయకులు ఆరా తీశారు. ఆరు నూరైనా సరే వికలాంగుల సంక్షేమం కోసం తమ సర్కార్ ప్రయత్నం చేస్తోందని చెప్పారు. దివ్యాంగులకు ఉచిత ప్రయాణం ద్వారా రూ. 207 కోట్లకు పైగా ఖర్చు అవుతోందని, దీనిని తాము భరిస్తున్నామని ప్రకటించారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామన్నారు.


















