గెలిచిన స‌ర్పంచ్ ల‌కు అండ‌గా ఉంటాం : కేటీఆర్

ప్ర‌తీ జిల్లాకు ఒక లీగ‌ల్ సెల్ ను ఏర్పాటు చేస్తాం

hellotelugu-KTR

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండ‌వ విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిశాయి. ఇక మూడో విడ‌త స‌ర్పంచ్, వార్డు స‌భ్యుల ఎన్నిక‌లు ఈనెల 17న జ‌ర‌గ‌నున్నాయి. ఇదిలా ఉండ‌గా తొలి విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారులు స‌త్తా చాటారు. ఇక రెండో విడ‌త‌లో ఊహించ‌ని రీతిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థులకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆశించిన దానికంటే అత్య‌ధిక స్థానాల‌లో గులాబీ పార్టీ మ‌ద్ద‌తుదారులు జ‌య‌కేత‌నం ఎగుర వేశారు. విచిత్రం ఏమిటంటే చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల స్వంత గ్రామాల‌లో గులాబీ జెండాలు ఎగ‌ర‌డం విస్తు పోయేలా చేసింది.

ఈ సంద‌ర్బంగా సోమ‌వారం కేటీఆర్ కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. గెలిచిన స‌ర్పంచ్ లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు. ప్రతీ జిల్లాకు ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి గెలిచిన సర్పంచులకు అండగా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు కేటీఆర్. కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడి, ఏదో ఒక కేసులో ఇరికించి మిమ్మల్ని సస్పెండ్ చేయించే కుట్రలు చేస్తారని, మీరు ఎవరికీ భయపడొద్దని భ‌రోసా ఇచ్చారు. మీకు రావాల్సిన పైసలు మోడీ, రేవంత్ రెడ్డి ఎవరూ ఆపలేరని, అది మీ హక్కు అని గుర్తించాల‌న్నారు. ఈ ప్రభుత్వంలో ఇంకో రెండున్నర ఏండ్లు మాత్రమే పని చేస్తారు, మళ్లీ మన ప్రభుత్వంలో ఇంకో రెండున్నర ఏండ్లు పనిచేస్తారని చెప్పారు కేటీఆర్. ఎవరికి ఏ ఆపద వచ్చినా మన పార్టీ కార్యాలయానికి వస్తే, మన నాయకులు, లీగల్ సెల్ మీకు అండగా ఉంటారని చెప్పారు.

Exit mobile version