సీఈసీపై అభిశంస‌న తీర్మానం తెస్తాం : సంజ‌య్ రౌత్

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన శివ సేన బాల్ ఠాక్రే పార్టీ అధికార ప్ర‌తినిధి

hellotelugu-SanjyRaut

ముంబై : శివ సేన బాల్ ఠాక్రే పార్టీ అధికార ప్ర‌తినిధి , ఎంపీ సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానం తెస్తామని ప్ర‌క‌టించారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. పార్లమెంటు ఉభయ సభలలో జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెడతామని రౌత్ ప్రకటించారు, అలాగే ఆయనపై ‘మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్’ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భారత ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు రౌత్. ఆయన “కేంద్ర ప్రభుత్వ ఏజెంట్”గా వ్యవహరిస్తున్నారని , ఎన్నికల సంఘాన్ని ఒక “మాఫియా ముఠా”లా నడుపుతున్నారని ఆరోపించారు. ఓటర్ల నమోదుకు సంబంధించిన ‘ఫారం 6’లో ఇటీవల చేసిన ఏకపక్ష మార్పులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరుల పూర్వీకుల మూలాలను లోతుగా ఆరా తీయడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని రౌత్ ప్రశ్నించారు.

ఓటర్ల తాతలు, ముత్తాతలు బతికి ఉన్నారా అని అడిగేలా జ్ఞానేష్ కుమార్ ఫారం 6ను మార్చార‌ని మండిప‌డ్డారు. మేము ఆయనను తిరిగి అడుగుతున్నాం. మీ సొంత పూర్వీకులు ఎవరో మీకు తెలుసా? అని ఆయన నిలదీశారు. రాజ్యాంగ బద్ధమైన పదవిని నిర్వహించే నైతిక హక్కును సీఈసీ కోల్పోయారని పేర్కొన్నారు. జ్ఞానేష్ కుమార్ ఒక రాజ్యాంగ మాఫియా. ఆయన తన బాస్ అయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు పనిచేస్తారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయన హోం మంత్రికి ‘ఛోటా షకీల్’ లాంటి వార‌న్నారు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే రాజకీయ షార్ప్ షూటర్. అభిశంసన ప్రక్రియను ప్రారంభించడానికి వివిధ పార్టీల ఎంపీల నుండి సంతకాలను సేకరిస్తామన్నారు సంజ‌య్ రౌత్. వ్యవస్థీకృత ఎన్నికల మోసానికి పాల్పడినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తామ‌న్నారు.

ప్రజాస్వామ్య వధశాల”గా అభివర్ణించారు. మహారాష్ట్ర, బీహార్ , పశ్చిమ బెంగాల్‌లలో బీజేపీ , దాని మిత్రపక్షాలు సాధించిన ఇటీవలి ఎన్నికల విజయాలు జ్ఞానేష్ కుమార్ ప్లాన్ చేసిన ఓటర్ల మోసం ద్వారానే సాధ్యమయ్యాయని రౌత్ ఆరోపించారు. ఆ ఎన్నికలను రద్దు చేసి, కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Exit mobile version