అమరావతి : వ్యవసాయ రంగాన్ని అభివృద్ధికి కేంద్ర బిందువుగా భావించి కనీసం 15 శాతం వార్షిక వృద్ధి సాధించాలనే స్పష్టమైన లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించిందని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. పది సూత్రాలలో వ్యవసాయ రంగానికి సంబంధించి “ఫార్మర్స్ అగ్రిటెక్” ముఖ్యమైన సూత్రంగా ఉందని అన్నారు. డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్లు, రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా, వ్యవసాయాన్ని లాభదాయకంగా మారుస్తున్నామన్నారు. అధిక ఆదాయ రంగంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. 2024-25 సంవత్సరంలో మన రాష్ట్రం వ్యవసాయ రంగంలో 11.64 శాతం వృద్ధిరేటుతో రూ.5,00,302 కోట్ల జి.వి.ఎ.ను (2024-25 FRE ప్రస్తుత ధరలలో) సాధించడం జరిగిందని చెప్పారు.
2025-26 సంవత్సరానికి వ్యవసాయ రంగంలో 16 శాతం వృద్ధి రేటుతో రూ.6,02,728 కోట్ల జి.వి.ఎ సాధించాలని లక్ష్యం కాగా, 7.83 శాతం వృద్ధిరేటుతో రూ.5,39,454 కోట్ల జి.వి.ఎ.ను (2025-26 FAE ప్రస్తుత ధరలలో) సాధించడం జరిగిందని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు. 2025-26లో వృద్ధి రేటు లక్ష్యాన్ని సాధించడం కోసం “రైతన్నా మీకోసం” కార్యక్రమాన్ని నవంబర్ 2025న సీఎం చంద్రబాబు ప్రారంభించడం జరిగిందన్నారు. 1) నీటి భద్రత, (2) డిమాండ్ ఆధారిత పంటలు, (3) అగ్రిటెక్, (4) ఫుడ్ ప్రాసెసింగ్, (5) ప్రభుత్వం నుంచి మద్దతు అనే అంశాలకి అధిక ప్రాధాన్యత కల్పించామన్నారు అచ్చెన్నాయుడు. ఈ పంచ సూత్రాల అమలులో భాగంగా, 2025 నవంబర్ 24 నుండి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నా మీకోసం వారోత్సవాలు నిర్వహించామన్నారు. తదనంతరం 2025 డిసెంబర్ 3న రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల స్థాయిలో పంటల ప్రణాళిక వర్క్‌షాప్‌లు నిర్వహించి, రాబోయే మూడు సీజన్లైన రబీ 2025–26, ఖరీఫ్ 2026 మరియు రబీ 2026–27 (R-K-R) కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశామన్నారు.
















