రాయ‌ల‌సీమ‌ను స‌స్య‌శ్యామ‌లం చేస్తాం

ప్ర‌క‌టించిన సీఎం చంద్రబాబు నాయుడు

hellotelugu-APCM

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆరు నూరైనా స‌రే ఎంత ఖ‌ర్చు అయినా స‌రే రాయ‌ల‌సీమ‌లో తాగు, సాగు నీటికి ఇబ్బంది లేకుండా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే రూ. 8 వేల కోట్లు ఖ‌ర్చు చేసి ప్రాజెక్టుల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నామ‌న్నారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల ఘనత టీడీపీదేన‌ని స్ప‌ష్టం చేశారు. హంద్రినీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ సహా అనేక ప్రాజెక్టులు రావడానికి నాడు తెలుగుదేశం పార్టీ చూపిన చొరవే కారణం అన్నారు. తెలుగుగంగ సీమను సస్యశ్యామలం చేయడంతో పాటు చెన్నై దాహార్తి తీరుస్తోందని చెప్పారు చంద్ర‌బాబు నాయుడు. నదుల అనుసంధానం చేసి సీమను సస్యశ్యామలం చేస్తామ‌న్నారు. అనంతపురం జిల్లాలో నీటి సంరక్షణకు తాము తీసుకున్న చర్యలతో ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారని గుర్తు చేశారు ఈ సంద‌ర్బంగా.

సీమను హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం అన్నారు. దేశంలో ఎక్కువ పండ్లు పండేది రాయలసీమలోనేన‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో 400 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు ఉత్పత్తి అయితే అందులో 220 లక్షల మెట్రిక్ టన్నులు సీమ నుంచే వస్తున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో 500 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు ఉత్పత్తయ్యేలా చర్యలు తీసుకుంటాం అని స్ప‌ష్టం చేశారు. గత ప్రభుత్వంలో 8 సార్లు చార్జీలు పెంచారని ఆరోపించారు. రూ. 32 వేల కోట్ల మేర విద్యుత్ భారాన్ని మోపారని మండిప‌డ్డారు. రూ.1.20 లక్షల కోట్ల అప్పు చేశారని ధ్వ‌జ‌మెత్తారు. కూటమి ప్రభుత్వం భవిష్యత్ లో కరెంటు చార్జీలు పెంచబోదని హామీ ఇస్తున్నానని ప్ర‌క‌టించారు. నేనూ రాయలసీమలోనే పుట్టాను. ఎన్టీఆర్ కూడా సీమ ముద్దు బిడ్డే. మూడేళ్లలో కడప స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి చేసే బాధ్యత నాది అని పేర్కొన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులు పెడుతున్నాం అన్నారు. సీమలో స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఆటో మొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు.

Exit mobile version