ఖమ్మం జిల్లా : వైరాను అన్ని రంగాలలో అభివృద్ది చేస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైరా పట్టణంలో పర్యటించారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. వైరా నా ఊరు అని, దానిని రాష్ట్రానికే తలమానికంగా తయారు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని జోష్యం చెప్పారు. ఈ సందర్బంగా నిర్వహించిన ర్యాలీ, కార్నర్ మీటింగ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గారు, డీసీసీ నూతి సత్యనారాయణ గౌడ్ గారు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. వైరా వాసిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా వైరా పట్టణ సమగ్ర అభివృద్ధి బాధ్యతను పూర్తిగా స్వీకరిస్తున్నానని సభ సాక్షిగా ప్రకటించారు.
ఈ ఎన్నికలు కేవలం ఓటింగ్ కార్యక్రమం కాదన్నారు. వైరా భవిష్యత్తును నిర్ణయించే తీర్పు. అభివృద్ధి దిశగా ముందుకు సాగాలా, లేక గత నిర్లక్ష్య పాలనను కొనసాగించాలా అన్నది ప్రజలు ఆలోచించి నిర్ణయించు కోవాలని అన్నారు మల్లు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ హయాంలోనే వైరాలో అభివృద్ధి జరిగిందన్నారు. రూ.200 కోట్లతో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, 100 పడకల ఆసుపత్రి, జూనియర్ కాలేజీ, ఐటీఐను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌గా అభివృద్ధి చేయడం, పాలిటెక్నిక్ మంజూరు వంటి కార్యక్రమాలు వైరా భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారనున్నాయని చెప్పారు.
