అమరావతి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోనే అనకాపల్లిని అన్ని రంగాలలో టాప్ లో నిలిచేలా అభివృద్ది చేస్తామన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి బడ్జెట్ ఔట్ రీచ్ 2026-27 సమావేశంలో పాల్గొన్నారు. గత ఐదేళ్ల విధ్వంసకర పాలన నుండి రాష్ట్రాన్ని విముక్తం చేసి, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేశాం అన్నారు . బడ్జెట్ కేటాయింపులపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులపై ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు , అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
అనకాపల్లి జిల్లాను ఒకవైపు పారిశ్రామికంగా, మరోవైపు వ్యవసాయ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి వంగలపూడి అనిత. పారిశ్రామిక ప్రగతితో పాటు అన్నదాతల సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశాం అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి రూపాయి ప్రజల అభివృద్ధికి అందేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. అందరం కలిసికట్టుగా జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు.
సమావేశంలో ఏపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ డి. రోనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ , శాసన సభ్యులు ఎస్ఎంఎస్ రాజు , సుందరపు విజయ్ కుమార్, బండారు సత్యనారాయణ మూర్తి, కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర , రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, ఏపి ఆర్ డి సి కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారు, డీసీఎంఎస్ చైర్మన్ కొట్నీ బాలాజీ , జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్, జిల్లా స్థాయి రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
