పాకిస్తాన్ : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టి20 వరల్డ్ కప్ -2026 కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి వరల్డ్ కప్ ను భారత్ తో పాటు శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉండగా భారత దేశంలో భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చేతులెత్తేసింది. తాము ఈ టోర్నీలో పాల్గొనబోమంటూ ప్రకటించింది. సెక్యూరిటీని సాకుగా చూపించింది. అయితే బంగ్లా బోర్డు దాదాపు రూ. 200 కోట్లకు పైగా నష్ట పోనుంది. ఇదే సమయంలో పాకిస్తాన్ సైతం వరల్డ్ కప్ లో ఆడాలా వద్దా అనే దానిపై ఇంకా కీలక నిర్ణయం తీసుకోలేదు. భారీ ఎత్తున ఆ జట్టుకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. దీంతో దీనిపై క్లారిటీ ఇస్తామని తాజాగా స్పష్టం చేశారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ.
ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ను కలిశారు. కాగా టి20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ జట్టును బహిష్కరించింది ఐసీసీ. దీనికి వ్యతిరేకంగా గళం విప్పుతూ వస్తోంది పాకిస్తాన్ బోర్డు. తాము ఈ టోర్నీలో ఆడలా వద్దా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఏదో ఒకటి తేల్చుకోవాలని ఇప్పటికే ఐసీసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీనిపై స్పందించారు మొహిసిన్ నఖ్వీ. ఈ సందర్బంగా పీఎంను కలిసిన అనంతరం నఖ్వీ మీడియాతో మాట్లాడారు. బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ వ్యవహరించిన తీరుపై ప్రధానితో చర్చించామన్నారు. ఫిబ్రవరి 2వ తేదీ లోపు ఆడలా లేదా అన్న దానిపై తుది ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు.



















