మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి

స్ప‌ష్టం చేసిన పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

hellotelugu-PonguletiSrinivasReddy

ఖ‌మ్మం జిల్లా : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే మున్సిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామ‌న్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు క్యాంపు కార్యాలయంలో ఇల్లెందు, ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య , స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు మంత్రి. ఈ సందర్భంగా అన్ని వార్డుల నుంచి తరలి వచ్చిన పార్టీ ఇంచార్జీలు, ముఖ్య నాయకులకు, ఆశావాహులకు దిశానిర్దేశం చేశారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. శివరాత్రి లోపు ఎన్నికలు, కౌంటింగ్, ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. సమయం తక్కువగా ఉన్నందున పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఏదులాపురం, ఇల్లెందుల అభివృద్ధికి ఇప్పటికే కోట్ల రూపాయల నిధులను కేటాయించామ‌ని చెప్పారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. భవిష్యత్తులో మరింత భారీగా నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీల రూపురేఖలు మారుస్తాన‌ని ప్ర‌క‌టించారు . త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో పార్టీ బలపరచిన అభ్యర్ధులను గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగుర వేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఎవ‌రు నిర్ల‌క్ష్యం వ‌హించినా పార్టీకి, త‌న‌కు డ్యామేజ్ జ‌రుగుతుంద‌న్నారు. క‌నుక ప్ర‌తి ఒక్క‌రు రేయింబ‌వ‌ళ్లు ప‌ని చేయాల‌ని కోరారు.

Exit mobile version