విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె రాష్ట్ర సర్కార్ ను ఏకి పారేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. 44 స్థానాల్లో భాగంగా, 42 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి 10 స్థానాలను గెలిపించినందుకు ఆమె మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ను అభినందించారు. మిగతా స్థానాల్లో సైతం పార్టీని రెండో స్థానంలో నిలబెట్టడంలో ప్రత్యక్ష పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ సారథ్యంలో, చీరాలలో అభ్యర్థుల గెలుపు మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం అన్నారు షర్మిలా రెడ్డి. స్థానికంగా ప్రజా సమస్యలపై మీ అకుంఠిత పోరాట పటిమకు నిదర్శనం ఈ ఫలితాలని పేర్కొన్నారు. చీరాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం.. నిజమైన ప్రజాస్వామ్య విజయానికి సంకేతమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీనే ఇక ప్రత్యామ్నాయం అనడానికి ఇదొక నిదర్శనమని అన్నారు.
ప్రజల గొంతుకను నొక్కి పెట్టాలని చూసిన కూటమి శక్తులను ఎదిరించి, అధికార బలాన్ని తట్టుకుని, ప్రలోభాలకు లొంగకుండా, ప్రజా పక్షాన నిలిచి పోరాడి గెలిచిన మన వార్డు సభ్యులకు, అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు అభినందనలు తెలియ చేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను నమ్మి ఓటేసి గెలిపించిన చీరాల ప్రజలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకోలేక పోయినా, గౌరవ ప్రదమైన స్థానాలు దక్కించుకొని, ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్న కాంగ్రెస్ దే చీరాలలో అసలైన నైతిక విజయంగా అభివర్ణించారు వైఎస్ షర్మిలా రెడ్డి. చీరాల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కూటమి నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టే విధంగా, అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని, గెలుపొందిన మన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు అంకితభావంతో పనిచేస్తారని ఆశిస్తున్నానని అన్నారు.
