అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. శనివారం ఉల్లిగడ్డ సాగు రైతులకు తీపి కబురు చెప్పింది. కనీస మద్దతు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు కనీస ధర కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సీఎం ఆదేశాల మేరకు తక్షణమే నిధులను వారి ఖాతాల్లో జమ చయాలని స్పష్టం చేశారని తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఇవాళ ఆయన కర్నూల్ జిల్లాలోని కోడుమూరులో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఖరీఫ్ ఉల్లి సంక్షోభాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గుర్తించిందని చెప్పారు.
మార్క్ ఫెడ్ ద్వారా భారీగా ఉల్లి కొనుగోళ్లు చేసినట్లు తెలిపారు. రైతులకు మద్దతు MSP (కనీస మద్దతు ధర) కింద 69,779 క్వింటాళ్లు, PDPS (ధర వ్యత్యాస చెల్లింపు పధకం) కింద 99,157 క్వింటాళ్లు కొనుగోలు చేశామన్నారు అచ్చెన్నాయుడు. మొత్తం 1,68,936 క్వింటాళ్లకు గాను రూ. 17.22 కోట్లు ఖర్చవుతోందని తెలిపారు. కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 37,752 మంది రైతులకు సీఎం చంద్రబాబు ప్రకటించిన హెక్టారుకు 50,000 చొప్పున రూ. 128.33 కోట్లు రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. కర్నూలు జిల్లాలోనే 31,352 మంది రైతులకు 99.92 కోట్లు జమ చేశామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు.


















