అమరావతి : ఏపీలో విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని చెప్పారు హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. ఫైర్ మెన్ లకు అత్యాధునిక శిక్షణను ఇవ్వడమే కాకుండా అగ్నిమాపక శాఖకు ఆధునిక పరికరాలను, మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతోందన్నారు. విజయనగరం అగ్నిమాపక కేంద్రాన్ని రూ. కోటి 65 లక్షలు, బొబ్బిలి అగ్నిమాపక కేంద్రాన్ని రూ. కోటి 25 లక్షలు, పూసపాటి రేగ అగ్నిమాపక కేంద్రాన్ని రూ. 2 కోట్ల 25 లక్షలు, పాలకొండ అగ్నిమాపక కేంద్రాన్ని రూ. కోటి 35 లక్షలు, సోంపేట కేంద్రాన్ని రూ. కోటి 25 లక్షలతో నిర్మించడం జరిగిందని చెప్పారు హోం శాఖ మంత్రి. గత రెండు సంవత్సరాలుగా అగ్నిమాపక శాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామని అన్నారు. విపత్తుల సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీస్, ఫైర్ సిబ్బంది అత్యంత సాహసోపేతంగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఐఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకొని పని చేసే విధంగా ఆధునిక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఒకేరోజు ఐదు అగ్నిమాపక కేంద్రాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు వంగలపూడి అనిత. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న విజయనగరం గడ్డపై ఈ కార్యక్రమం జరగడం విశేషమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సంపూర్ణంగా వినియోగించు కోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు వరుసలో ఉందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇప్పటికే రెండుసార్లు అగ్నిమాపక శాఖకు సంబంధించిన నూతన వాహనాలను ప్రారంభించు కోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గంలోనూ ఫైర్ స్టేషన్‌లను అందుబాటులోకి తీసుకు రావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ నివారణను సిబ్బందికి తగిన ఆధునిక శిక్షణ ఇచ్చి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు.

















