అమరావతి : ఏపీ విత్యుత్, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ప్రకటన చేశారు. తమ సర్కార్ ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. విద్యుత్ ఛార్జీలను ఏమాత్రం పెంచకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎక్కడా ఆటంకం కలగడం లేదన్నారు. సాధారణ విద్యుత్ వినియోగదారులతో పాటు రైతులకు కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉందని వెల్లడించారు. ఇది మెరుగైన పనితీరుకు , ప్రణాళికాబద్ధతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
విజయవాడ నగరంలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించి కొత్త కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు గొట్టిపాటి రవికుమార్. రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, సేవల పంపిణీని మెరుగు పరచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తక్కువ వోల్టేజ్ సమస్యలను పరిష్కరించడానికి, స్థిరమైన విద్యుత్ సరఫరాను నిర్ధారించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యుత్ ఉపకేంద్రాలను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా వరదల సమయంలో, రాత్రింబవళ్లు అవిశ్రాంతంగా పనిచేసి విద్యుత్ శాఖ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని గొట్టిపాటి రవి కుమార్ ప్రశంసించారు.

















