ఉద్యోగుల సమస్యల పరిష్కానికి క‌ట్టుబ‌డి ఉన్నాం

మంత్రులు కొలుసు పార్ధసారధి,అనగాని సత్యప్రసాద్

hellotelugu-APMinisters

అమ‌రావ‌తి : రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు ,గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ లు స్పష్టం చేశారు. ఎపి సచివాలయంలో ఎపి జెఎసి అమరావతి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శనివారం ఇరువురు మంత్రుల నేతృత్వంలో సమావేశమై ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రాథ‌మికంగా చర్చించారు. ఈసమావేశం అనంతరం మంత్రులు ఇరువురు మీడియాతో మాట్లాడారు. పార్ధసారధి మాట్లాడుతూ ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరు కావాల్సి ఉండగా ముందస్తు కార్యక్రమాలు మూలంగా ఆయన రాలేక పోయారని స్పష్టం చేశారు .గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా సమస్యలను ప్రక్కన పెట్టడంతో ఈ సమస్య వచ్చిందని పేర్కొన్నారు.ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మొత్తం 23 డిమాండ్లను ఇవ్వడం జరిగిందన్నారు.

వాటన్నిటినీ మంత్రులు ఇరువురం క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని ఉద్యోగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు పూర్తి సానుకూలంగా ఉన్నారని అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై చర్చిచేందుకు ఈనెల 21వ తేదీన సచివాలయంలో అన్ని ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రులు ఇరువురూ ప్రకటించారు. ఈలోగా రాష్ట్ర ఆర్ధిక మంత్రితో కూడా ఉద్యోగ సంఘాల సమస్యలపై మరొక సారి చర్చిస్తామని వారు పేర్కొన్నారు. అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశం పూర్తి సహృద్భావ వాతావరణంలో జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకంతోనే నేడు ఉద్యోగులకు ఈపరిస్థితి వచ్చిందని ఆరోపించారు.

Exit mobile version