తాడేపల్లి/అమరావతి : భగీరథ మహర్షీ స్ఫూర్తితో రాష్ట్రంలో జల సంరక్షణను ఉద్యమంగా చేపట్టామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. అపర భగీరథుడు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో ఇప్పటికే భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారన్నారు. ఏపీకి గుండెకాయ లాంటి పోలవరం నిర్మాణం పూర్తయితే రాష్ట్ర రూపు రేఖలే మారిపోతాయని అన్నారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి సవిత పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దివి నుంచి భువికి గంగను తీసుకొచ్చిన భగీరథ మహర్షి మహనీయుడని కొనియాడారు. గంగను భూమికి తీసుకు రావడానికి ఆయన కఠోర తపస్సు చేశాడన్నారు. సగరుల కుల దైవమైన భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.
పట్టుదలకు మూల పురుషుడైన భగీరథుని స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జల సంరక్షణకు పెద్ద ఉద్యమమే చేస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పోలవరం సహా కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాయలసీమలో సాగునీటి కల్పనకు 2014-19 మధ్య కాలంలో రూ.12,441 కోట్లు వెచ్చించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత రూ.6,613 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు సవిత. రూ.3,870 కోట్లు వెచ్చించి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను మడకశిరకు, కుప్పానికి తరలించామన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి సాగు చేసేందుకు పూర్తిస్థాయి సాగునీరు అందించడంతో పాటు తాగునీటి కల్పనకు జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. నీటితోనే అభివృద్ధి అని సీఎం చంద్రబాబు నమ్మిన సిద్దాంతమని మంత్రి సవిత తెలిపారు.

















