చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఇప్పుడు లండన్ పర్యటనలో బిజీగా ఉన్నారు. అయితే ఆయన పర్యటన పలు విమర్శలకు తావిచ్చేలా చేసింది. తను నటి త్రిష కృష్ణన్ తో కలిసి నటుడు అజిత్ పాల్గొన్న కార్ రేసును స్టాండ్స్ లో ఉండి వీక్షించారు. దీంతో విజయ్, త్రిషల ప్రేమాయణం ఇంకా కొనసాగుతూనే ఉందని, తనను కలిసేందుకే విజయ్ ఈ టూర్ ప్లాన్ చేసుకున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ వైపు తమిళనాడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం పర్యటన పేరుతో ఎంజాయ్ చేస్తున్నాడంటూ మండిపడ్డారు.
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో సీఎం విజయ్ టూర్ పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జ్యోతిష్య సలహా మేరకు గ్రహ స్థితులను సరి చేసుకోవడానికే ఈ యూకే పర్యటన అని ప్రచారం జరుగుతోంది, అయితే దీనిపై ఎవరికీ స్పష్టత లేదు. విమర్శకులు, రాజకీయ ప్రత్యర్థులు ఈ పర్యటనపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశాన్ని అంది పుచ్చుకున్నారు. నటుడు-రాజకీయ నాయకుడైన విజయ్‌కు సంబంధించిన జ్యోతిష్య అంచనాలు ప్రజలకు కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా సినిమా , రాజకీయ రంగాలలో ఆయన ప్రస్థానం, కెరీర్ మార్పులు తరచుగా తీవ్రమైన జ్యోతిష్య విశ్లేషణలకు కేంద్ర బిందువుగా నిలిచాయి. బాక్సాఫీస్ పోటీలు లేదా కీలకమైన కెరీర్ నిర్ణయాల సమయంలో జ్యోతిష్య నిపుణులు తరచుగా ఆయన జాతక చక్రాలపై తమ అభిప్రాయాలను వెల్లడించేవారు. నాయకత్వ బాధ్యతలు చేపట్టే సూచనలు ఉన్నాయని చెప్పే బలమైన గ్రహ కలయికలు ఆయన జాతకంలో ఉన్నాయని చాలామంది పేర్కొన్నారు.
2026 ఎన్నికలకు ముందు “సునామీ లాంటి” జాతక ప్రభావం ఉంటుందన్న వాదనలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. కొందరు ఆయన రాజకీయ ప్రవేశ సమయాన్ని కూడా గ్రహ దశలు, గోచార ఆధారంగా అంచనా వేశారు. ఈ లండన్ పర్యటన ఆ పాత చర్చలను మళ్లీ తెరపైకి తెచ్చింది. మద్దతుదారులు దీనిని సాధారణ దౌత్యపరమైన పర్యటనగా భావిస్తుండగా, విమర్శకులు , ఆన్‌లైన్ వ్యాఖ్యాతలు దీనిని గ్రహ దోష నివారణ చర్యలతో ముడి పెడుతున్నారు. గ్రహ స్థితుల సవరణ సిద్ధాంతానికి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు, అయినప్పటికీ ఈ ఊహాగానాలు వ్యాపిస్తూనే ఉన్నాయి. జ్యోతిష్కుడు రాధా పండిట్‌కు సంబంధించిన ఇటీవలి వివాదం ఈ చర్చలకు మరింత ఆజ్యం పోసింది. విజయ్ ఎదుగుదలను ముందుగానే అంచనా వేసినట్లు చెప్పుకోవడం ద్వారా పండిట్ వార్తల్లో నిలిచారు.
