అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వృద్దుల సంక్షేమం కోసం తమ కూటమి సర్కార్ కట్టుబడి ఉందన్నారు. విశాఖపట్నంలో రూ.172 కోట్లతో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణం చేపట్టాం అన్నారు. ఏ ప్రాంతంలో మహిళా ఉద్యోగులు పనిచేస్తారో అక్కడ కొత్తగా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మూడో సంతానం, ఆపై జననాలకు 12 నెలల పేరెంటల్ లీవ్ – తండ్రులకు 2 నెలలు పెటర్నల్ లీవ్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. మూడో సంతానానికి ‘పోషణ-శిక్షా-సురక్ష’ ప్యాకేజ్ ఇస్తాం అన్నారు. మూడో సంతానానికి డెలివరీ సమయంలో రూ.25,000 ప్రోత్సాహకంగా ఇవ్వడంతో పాటు 5 సంవత్సరాల పాటు నెలకు పోషణ కింద రూ.1,000 సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. త్వరలో ‘తల్లి దండ్రుల సమాన బాధ్యత’ పేరుతో కుటుంబ బాధ్యతలు పంచు కోవడంపై అవగాహన క్యాంపెయిన్ చేపడతాం అన్నారు. పిల్లల కేర్ టేకర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం అన్నారు.
ఇక 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల జనాభా 23 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నాం అన్నారు చంద్రబాబు నాయుడు. వృద్ధుల సంరక్షణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తాం అన్నారు. 175 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో రెండు వారాలకు ఒకసారి ప్రత్యేక క్లినిక్ నిర్వహిస్తామని తెలిపారు సీఎం. సిల్వర్ స్కిల్స్ రిజిస్ట్రీ ద్వారా 50,000 రిటైర్డ్ ప్రొఫెషనల్స్‌ను మెంటారింగ్‌లో భాగం చేస్తాం అన్నారు. రిటైర్మెంట్కు ముందే ఉద్యోగులకు 15 రోజుల వెల్నెస్ లీవ్, రూ.50,000 ఆరోగ్య నిధి కింద అందిస్తామన్నారు. వైద్య సేవలు అందించేందుకు డిజిటల్ మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థకు డిజిటల్ నెర్వ్ సిస్టమ్ ప్రాజెక్ట్ సంజీవని నిలుస్తుందన్నారు. ఇది కుప్పంలో విజయవంతమైంందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. త్వరలో రాష్ట్రమంతా అమలు చేస్తాం అన్నారు. ఈ ఏడాది జూలై నాటికి 5.2 కోట్ల ప్రజలను 2,086 ఆరోగ్య కేంద్రాల ద్వారా డిజిటల్ గా సంజీవని ప్రాజెక్టుతో అనుసంధానిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 71 లక్షల హై-రిస్క్ కేసులు గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.

















