విశాఖపట్నం : కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి హెచ్ డీ కుమార స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన విశాఖలో పర్యటించారు. ఈ సందర్బంగా కీలక సమీక్ష చేపట్టారు. పలు సూచనలు చేశారు. దేశంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కు అరుదైన చరిత్ర ఉందన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు తో పాటు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సమక్షంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణపై ప్రత్యేకంగా చర్చించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కుమార స్వామి మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ఆర్థిక ప్యాకేజీ అనంతరం ఉత్పత్తి కార్యకలాపాలు పుంజుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. అలానే ప్లాంట్‌ను లాభాల బాట పట్టించాలంటే ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలన్నారు. అంతే కాకుండా ప్రధానంగా సంస్థ సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు కేంద్ర మంత్రి దిశానిర్దేశం చేశారు.. విశాఖ ఉక్కుకు ఉన్న ప్రత్యేక నాణ్యత, విశ్వసనీయతను కాపాడుతూ ప్లాంట్ ను మరింత బలోపేతం చేసేలా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం, యాజమాన్యం , ప్రజాప్రతినిధుల సమన్వయంతో విశాఖ స్టీల్‌ను మళ్ళీ లాభదాయక సంస్థగా తీర్చిదిద్దుతామని పల్లా శ్రీనివాసరావు ఈ సందర్బంగా ధీమా వ్యక్తం చేశారు.
