అమరావతి : మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు సమీపంలోని శ్రీ మాలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించచి ప్రసంగించారు వెంకయ్య నాయుడు. తన జీవితాంతం దేశం కోసం బతికిన గొప, అరుదైన నాయకుడు అబ్దుల్ కలాం అని ప్రశంసలు కురిపించారు. ఆయన విగ్రహాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు వెంకయ్య నాయుడు. ఈ సందర్భంగా వారి స్మృతికి నివాళులర్పిస్తున్నానని అన్నారు. తమ భవిష్యత్తు గురించి ఆలోచించేవారు గొప్పవారు, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించేవారు మహోన్నతంగా ఎదుగుతారని అన్నారు.
ఈ ప్రపంచం ఉన్నంత దాకా అబ్దుల్ కలాం బతికే ఉంటారని చెప్పారు ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఆయనను స్పూర్తిగా యువత తీసుకోవాలని పిలుపునిచ్చారు. తమ జీవితంలో ఆచరణలో పెట్టాలని అన్నారు. యువతను కలవడం, వారితో ముచ్చటించడం, వారి అభిప్రాయాలను తెలుసుకోవడం, వారిని కార్యోన్ముఖులను చేయడం నాకు ఆనందాన్ని ఇస్తుందని అన్నారు వెంకయ్య నాయుడు. యువతను ప్రోత్సహిస్తే వారు సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంతో, విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక రుగ్మతలకు మనం ముగింపు పలకవచ్చని అన్నారు.
విద్యార్థుల చదువులు కేవలం డిగ్రీల కోసమో, ఉద్యోగాల కోసమో కాదని ప్రతి ఒక్కరూ గ్రహించాలని అన్నారు. యువతలో ఉన్న ప్రతిభను వెలికితీయాలని కోరారు. వారిని పరిశోధనల వైపు ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకునేలా, పరిశీలించేలా చేయాలని స్పష్టం చేశారు వెంకయ్య నాయుడు. విద్యా సంస్థలకు, పరిశ్రమలకు మధ్య సమన్వయం సాధించేలా ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా వ్యవస్థ ముందుకు సాగడానికి ప్రతిభే ప్రధాన అవసరం అన్నారు.















