హైదరాబాద్ : వరంగల్ ఘటన నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అగ్నిమాపక భద్రతపై సమీక్ష చేపట్టారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాల అమలు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్ని ఆరోగ్య కేంద్రాలలో అగ్నిమాపక భద్రతా తనిఖీల నిర్వహణ, ఆసుపత్రులలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాల అమలు, లోపాలను గుర్తించడం, వాటిని సరిదిద్దే చర్యల గురించి ఆరా తీశారు దామోదర రాజ నరసింహ. ప్రభుత్వ ఆసుపత్రులలో అగ్నిమాపక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. అలాగే అగ్నిమాపక భద్రతా తనిఖీలను కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని అధికారులు మంత్రికి ఈ సందర్బంగా వివరించారు.
ఇప్పటికే నిర్వహించిన అగ్నిమాపక తనిఖీలలో గుర్తించిన సమస్యలను, తీసుకున్న చర్యల గురించి ఆరా తీశారు మంత్రి. అగ్నిమాపక భద్రతలో లోపాలు ఉన్నచోట తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్, ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జాన్ థోంగ్తు, అగ్నిమాపక భద్రతా శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, ఆరోగ్య, ఇంధన, ఆర్&బి, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పలు సూచనలు కూడా చేశారు మంత్రి దామోదర రాజ నరసింహ.
















