ఎన్నో జ‌న్మ‌ల పుణ్యం వైదిక విద్య‌ను అభ్య‌సించే అవ‌కాశం

శ్రీ శృంగేరీ శార‌దా పీఠం ఉత్త‌రాధికారి శ్రీ విధుశేఖ‌ర భార‌తి స్వామీజీ

hellotelugu-TTD

తిరుమ‌ల : ఎన్నో జ‌న్మ‌ల్లో పుణ్యం చేసుకుంటే గానీ వైదిక విద్య‌ను అభ్య‌సించే అవ‌కాశం క‌ల‌గ‌ద‌ని శ్రీ శృంగేరీ శార‌దా పీఠం ఉత్త‌రాధికారి శ్రీ విధుశేఖ‌ర భార‌తి స్వామీజీ పేర్కొన్నారు. తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వ‌ద్ద ఉన్న శ్రీ‌వేంక‌టేశ్వ‌ర వేద విజ్ఞాన పీఠంలో ఆరు రోజుల పాటు నిర్వ‌హించిన 29వ‌ శ్రీ‌వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సు స‌మాప‌నోత్స‌వానికి (విజ‌యోత్స‌వానికి) విశిష్ట అతిథిగా ఆయ‌న విచ్చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న వేద విద్యార్థుల‌ను ఉద్దేశించి అనుగ్ర‌హ భాష‌ణం చేశారు. ధ‌ర్మ‌మే స‌మ‌స్త ప్ర‌పంచానికి ఆధార‌మ‌ని, వైదిక మార్గం ద్వారానే ప్ర‌పంచ శ్రేయ‌స్సు ల‌భిస్తుంద‌ని చెప్పారు. ప‌ర‌మ ప‌విత్ర‌మైన తిరుమ‌ల క్షేత్రంలో ఉన్న వేద విజ్ఞాన పీఠం ప్రాచీన కాలం నుండి వేద‌, శాస్త్ర, ఆగ‌మ విద్య‌ల‌కు సంజీవ‌నిగా నిలుస్తోంద‌న్నారు . వైదిక విద్య చాలా ఉత్కృష్ట‌మైన విద్య అని అన్నారు. అన్ని ప్ర‌మాణాల్లో వేదాలే స‌ర్వ శ్రేష్ట‌మైన‌వి అని తెలిపారు. వైదిక విద్య‌కు ఆచారం, సాంప్ర‌దాయ‌మే ముఖ్య‌మ‌ని చెప్పారు. వైదిక విద్య‌ను అభ్య‌సించిన వారిని స‌మాజం మొత్తం గౌర‌వించాల‌ని సూచించారు.

అనంత‌రం ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులైన 313 మంది విద్యార్థుల‌ను స‌న్మానించి విజ‌య ప‌త్రిక‌ల‌ను ప్ర‌దానం చేశారు. కాగా వేద‌, శాస్త్ర, ఆగ‌మాల్లోని 37 విభాగాల్లో దేశ వ్యాప్తంగా 412 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వ్వ‌గా 313 మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. వీరిలో 202 మంది ప్ర‌థ‌మ శ్రేణిలో ఉత్తీర్ణుల‌వ్వ‌గా, 111 మంది ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుల‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ‌సుబ్ర‌హ్మ‌ణ్య అవ‌ధాని, ఇత‌ర పండితులు పాల్గొన్నారు.

Exit mobile version