Varalakshmi Vratam : తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయ ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. వేకువజామున అమ్మ వారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్ర నామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మ వారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతీ అమ్మ వారి ఉత్సవ మూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మ పీఠంపై ఆశీనులను చేశారు . అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, కలశ స్థాపన, అమ్మ వారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్ర నామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ వారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, తామరపూలు, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పాలతో అమ్మ వారిని ఆరాధించారు.
Varalakshmi Vratam Updates
ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మీ వ్రతం పూజా విధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని ఆలయ అర్చకులు శ్రీ శ్రీనివాస ఆచార్యులు తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, ఆచరించ వలసిన విధానాన్ని తెలియ చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. త్రేతా యుగంలో కుండలినీ నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీ నోము ఆచరించి పొందిన ఫల ప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో తిరుచానూరులో శ్రీ పద్మావతీ అమ్మ వారు అవతరించారని, వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘ మాంగల్య సౌఖ్యం, సిరి సంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం వంటి ఎన్నో మహా ఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు.
తరువాత 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మ వారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratam) ముగిసింది. ఈ సందర్భంగా టిటిడి (TTD) ఈవో జె.శ్యామల రావు మీడియాతో మాట్లాడారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని (Varalakshmi Vratam) అత్యంత వైభవంగా నిర్వహించినట్లు చెప్పారు. ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడికి అమ్మ వారి ప్రసాదాలు అందించేలా చర్యలు చేపట్టామన్నారు.
మహిళలు పెద్ద సంఖ్యలో వ్రతంలో పాల్గొన్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్న ప్రసాదాలు, తాగు నీరు, మజ్జిగ, తదితర ఏర్పాట్లు చేశామన్నారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందించామన్నారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా టిటిడికి చెందిన 52 ఆలయాల్లో 8 లక్షల గాజులు, 1.60 లక్షల కంకణాలు, 1.60 లక్షల పసుపు దారాలు, 1.60 లక్షల కుంకుమ ప్యాకెట్లు, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పుస్తక ప్రసాదాలను అందించామన్నారు.
Also Read : CM Chandrababu Strong Promise : ఆదివాసీలకు 54 వేల ఇళ్లు నిర్మిస్తాం – సీఎం
