హైదరాబాద్ : సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు పొందిన పరుశురామ్ తో మెగా హీరో ఫ్యామిలీకి చెందిన వైష్ణవ్ తేజ్ సినిమా చేయబోతున్నట్లు సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున టాక్ కొనసాగుతోంది. గతంలో గీత గోవిందం, సర్కార్ వారి పాట మూవీస్ తో తనేమిటో చూపించాడు దర్శకుడు పరుశురామ్. ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం పరశురామ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ‘ఉప్పెన’ తర్వాత వరుస పరాజయాలను చవిచూసిన ఈ నటుడు, మంచి కథలతో బలమైన పునరాగమనం చేయాలని భావిస్తున్నారు. టాలీవుడ్ యువ మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తన మొదటి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద అదే స్థాయి విజయాన్ని సాధించలేక పోయారు. అందుకే ఇప్పుడు బలమైన పునరాగమనం కోసం ఆయన కొంత విరామం తీసుకున్నారు. ఆయన తదుపరి సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్ర దర్శకుడు పరశురామ్ పెట్లతో కలిసి పని చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. పరశురామ్ చెప్పిన కథ వైష్ణవ్‌కు నచ్చిందని, అందుకే ఆయన సానుకూలంగా స్పందించారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పట్టాలెక్కితే దిల్ రాజు నిర్మాణ సంస్థలో ఇది రూపొందే అవకాశం ఉంది. అలాగే, ప్రముఖ దర్శకుడు వి.ఐ. ఆనంద్ తో కూడా వైష్ణవ్ ఒక ప్రాజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకులు , నటులు ఇద్దరికీ బలమైన పునరాగమనం అవసరం కాబట్టి, ఆసక్తికరమైన కథాంశంతో ప్రేక్షకులను అలరించేలా ప్లాన్ చేస్తున్నారు. వైష్ణవ్ తేజ్ చివరిగా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఆదికేశవ’లో కనిపించారు, కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. మరోవైపు ఆయన సోదరుడు సాయి ధరమ్ తేజ్ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా, జనవరి 12, 2027న తన తాజా చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
