తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 6, 7, 8వ తేదిల్లో రోజుకు 5 వేల టోకెన్ల చొప్పున తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 25వ తేదీ ఉదయం 10 నుండి 27 వ తేది సాయంత్రం 5 గంటల వరకు ఈ- డిప్ నమోదుకు టీటీడీ అవకాశం కల్పించనుంది.
తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరికి చెందిన స్థానికులు, భక్తులు పైన పేర్కొన్న తేదీల్లో 1+3 విధానంలో ఈ-డిప్ కోసం టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్. డిసెంబర్ 29న మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు కేటాయించడం జరుగుతుందన్నారు. ఇందులో రోజుకు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు 4500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు చొప్పున కేటాయించన్నట్లు తెలిపారు.
ఈ విషయాన్ని గమనించి స్థానికులు టోకెన్ల కోసం ఈ-డిప్ ద్వారా నమోదు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.



















