తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ప్రకటన చేశారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని స్పష్టం చేశారు. 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయించాలని టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనాలకు టీటీడీ చేపట్టిన ఏర్పాట్లపై అనిల్ కుమార్ సింఘాల్ భక్తులకు వివరించారు. నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించామని చెప్పారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు అనిల్ కుమార్ సింఘాల్. వైకుంఠ ద్వార దర్శనాలకు లక్షలాదిగా రానున్నారని అంచనా వేశామన్నారు. డిసెంబర్ 30 నుండి జనవరి 08వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు కేటాయించినట్లు చెప్పారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అందుబాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164.15 గంటల సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు. ఇందుకు గాను 7.70 లక్షల మంది భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశామన్నారు అనిల్ కుమార్ సింఘాల్. ఇదిలా ఉండగా ఈ వైకుంఠ దర్శనం సమయంలో అన్ని బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని ప్రకటించారు . ఈ మేరకు శ్రీవారి భక్తులు తీసుకు వచ్చే సిఫార్సు లేఖలను స్వీకరించ బోమని అన్నారు. ఈ విషయాన్ని గమనించాలని, తమతో సహకరించాలని కోరారు అనిల్ కుమార్ సింఘాల్.


















