న్యూఢిల్లీ : బీహార్ కు చెందిన క్రికెట్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి అరుదైన పురస్కారం దక్కింది. శుక్రవారం రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో తను ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందుకున్నారు. ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా ప్రతిభ , ధైర్యం, సాహసాలు ప్రదర్శించిన పిల్లలకు కేంద్రం అవార్డులను ఇస్తుంది. ఈ ఏడాది అద్భుతమైన ప్రతిభా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు వైభవ్ సూర్యవంశీ. అత్యంత పిన్న వయసులోనే రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ లో వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. 15 ఫోర్లు 16 సిక్సర్లతో ఊచకోత కోశాడు. దీంతో తను ఇప్పుడు టీనేజ్ క్రికెట్ సంచలనంగా మారాడు.
తన ప్రతిభను గుర్తించింది కేంద్రం. ఆ మధ్యన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుసుకున్నాడు. వైభవ్ సూర్యవంశీకి 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ లభించింది. చిన్న వయసులోనే క్రీడారంగంలో తను సాధించిన అద్భుత విజయాలను ఈ సందర్భంగా గుర్తించారు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ ప్రస్థానం ప్రారంభమైంది. కేవలం 14 సంవత్సరాల 23 రోజుల వయస్సులోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా అతను నిలిచాడు. తన మూడవ ఐపీఎల్ మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి తక్షణమే వార్తల్లో నిలిచాడు.

















