జ‌గ‌న్ పాల‌న‌లో విధ్వంసం త‌ప్పా అభివృద్ది ఏదీ..?

నిప్పులు చెరిగిన రాష్ట్ర‌హోం శాఖ‌ మంత్రి అనిత

hellotelugu-AnithaVangalapudi

విశాఖ‌ప‌ట్నం జిల్లా : వైసీపీకి అధికారం పోయినా అహంకారం తగ్గ లేదని,గత పాలనలో అన్ని వర్గాలను భయపెట్టారని హోం మంత్రి అనిత అన్నారు. జగన్ అధికారం లేనప్పుడు అమరావతి రాజధాని అన్నారని, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని చెప్పి, ఇప్పుడు మావిగన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనత మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఏర్పడతాయని, అయితే వైసీపీ విధానాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని అన్నారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కంటే విధ్వంసమే ఎక్కువ జరిగిందన్నారు. అధికారంలోకి వస్తే వినాశనం చేస్తామని చెప్పడం బాధాకరమని పేర్కొన్నారు. జగన్‌ అధికారంలోకి రావడానికి అనేక అడ్డదారులు తొక్కారని ఆరోపించారు.

కుటుంబ సభ్యులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించు కున్నారని వ్యాఖ్యానించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు, ఇతర సంఘటనలను ప్రస్తావిస్తూ అప్పట్లో ప్రజలను తప్పుదోవ పట్టించారని, కానీ ప్రస్తుతం ప్రజలు నిజాన్ని గ్రహించారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగిన కొన్ని వివాదాస్పద ఘటనలను ప్రస్తావిస్తూ, చట్టం మరియు శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోందని స్ప‌ష్టం చేశారు. పోలీసు వ్యవస్థ చట్టపరంగా పని చేస్తుందని, ఎలాంటి అరాచకాలకు అవకాశం ఉండదని అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలను నియంత్రించేందుకు కొత్త చట్టాన్ని తీసుకు రావాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు హోం మంత్రి తెలిపారు. జర్నలిజం బాధ్యతాయుతంగా ఉండాలని, అసత్య ప్రచారాలను అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Exit mobile version