హైదరాబాద్ : బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో, ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీ వస్తున్నాడనే పేరుతో ఎక్కడ చూసినా పోలీసులను మోహరించారని మండిపడ్డారు. ఇదేనా మీ ప్రజా పాలన అంటే అని నిలదీశారు. ఇవాళ రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీలు ఇచ్చారని కానీ ఇప్పటి వరకు కేవలం 10 వేల జాబ్స్ మాత్రమే భర్తీ చేశారని అన్నారు. రాహుల్ గాంధీ ని పిలిపించి అశోక్ నగర్ వీధుల్లో తిప్పి, విద్యార్థులతో చాయిపే చర్చలు పెట్టి నమ్మించి మోసం చేసిన ఘనత మీది కాదా అని సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు రాకేష్ రెడ్డి.
రాహుల్ గాంధీ! మీరు ఆటోలో తిరిగి అశోక్ నగర్ వీధుల్లో చక్కర్లు కొట్టింది మీకు గుర్తుందా? తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులకు మీరిచ్చిన హామీలు మీకు గుర్తున్నాయా? మీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఏమో కానీ స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన చెందారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని నిలదీశారు. మీరు ఎన్నికల ముందు నిరుద్యోగ యువతతో సమావేశమయ్యారు. వాళ్ల ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రాజ్యమేలుతున్నారు. కనీసం వాళ్ళు మిమ్మల్ని కలిసి అవకాశం కూడా ఇవ్వకుండా చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
















