అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పచ్చదనం, పర్యావరణానికి ప్రయారిటీ ఇస్తోంది. ప్రత్యేకించి ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. ప్రత్యేకించి అడవులను కాపాడుతోంది. వన్య ప్రాణులకు ప్రాణం పోస్తోంది. ప్రతి రోజూ వచ్చే భక్తులకు విశిష్ట సేవలు అందిస్తూనే పర్యావరణాన్ని కాపాడేందుకు నడుం బిగించింది. ఈ సందర్బంగా టీటీడీ చేస్తున్న ప్రయత్నాలు అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు కురిపించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మన సంప్రదాయాలు ప్రకృతిని పవిత్రమైనదిగా భావిస్తాయని తెలిపారు. అడవులు , వన్యప్రాణులను రక్షించడం దైవ సేవతో సమానమని పేర్కొన్నారు సీఎం.
భవిష్యత్ తరాల కోసం తిరుమలను మరింత పచ్చగా, ఆరోగ్యకరంగా పరిరక్షించడంలో సహాయపడే ఈ ప్రయత్నాలను తాను ప్రత్యేకంగా అభినందితస్తున్నట్లు పేర్కొన్నారు. శేషాచలం కొండలలో నిరంతర పరిరక్షణ ప్రయత్నాల ద్వారా తిరుమలలో 89.4 శాతం అటవీ విస్తీర్ణాన్ని సాధించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ)ని అభినందించారు. తాజా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం, టీటీడీ పరిధిలోని మొత్తం 2,719 హెక్టార్లలో దాదాపు 2,431 హెక్టార్లు అటవీ వృక్షసంపదతో నిండి ఉన్నాయని తెలిపారు. దీని ఫలితంగా తిరుమలలో 89.4 శాతం పచ్చదనం నమోదైందని టీటీడీ తెలిపిందని ఇందుకు ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని పేరు పేరునా అభినందిస్తున్నట్లు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు.
