తిరుపతి : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 30న టిటిడి స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించనున్నారు. తిరుపతి స్థానిక ఆలయాల్లో పుష్పాలంకరణలకు 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 1 లక్ష కట్ ఫ్లవర్స్ ఉపయోగించనున్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా వేకువ జామున 12.05 నుండి 1.35 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 1.35 నుండి రాత్రి 8.45 గంటల వరకు భక్తులను సర్వ దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారు జామున 2 నుండి 3 గంటల వరకు తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాలు జరుగనున్నాయి. ఉదయం 3 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు అమ్మవారికి ఆస్థానం నిర్వహిస్తారు.
డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 1.30 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 1.35 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 6 నుండి 7 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. అదేవిధంగా డిసెంబరు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4 నుండి 5.30 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు.
