తిరుమల : శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎంతగానో మేలు చేకూరుతోంది టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లగేజి డిపాజిట్ కేంద్రాలు. టీటీడీ లగేజీ డిపాజిట్ కేంద్రాల్లో భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసే సమయంలో సిబ్బంది ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా క్యూఆర్ కోడ్ జెనరేటర్ చేసి బ్యాగుపై కోడ్ స్కిక్కర్ వేస్తార. ఆ తర్వాత లగేజీకి సంబంధించిన సమాచారంతో ఒక స్లిప్ జెనరేట్ చేసి భక్తులకు అందిస్తారు. డిపాజిట్ డెలివరీ సమయంలో డెలివరీ కేంద్రంలో ఆ స్లిప్ సిబ్బందికి చూపితే ఆ నెంబర్ ఆధారంగా లగేజీని సులభంగా గుర్తించి ఒక నిమిషంలోపు లగేజీని భక్తులకు అందిస్తారు.
టీటీడీ కల్పించిన ఈ సేవలను భక్తులు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. 2026 జనవరి నెలలో అత్యధికంగా 10,44,268 డిపాజిట్లు నమోదయ్యాయి. 2026 జనవరి 25రథసప్తమి రోజున అత్యధికంగా 1,34,749 డిపాజిట్లు నమోదయ్యాయి. వైకుంఠ ఏకాదశి, గరుడసేవ, రథసప్తమి వంటి ఉత్సవాల సమయంలో భారీగా వినియోగం నమోదవుతోంది. తిరుమలకు విచ్చేసే భక్తులు తమ వద్ద ఉన్న లగేజీ, బ్యాగులు, సెల్ ఫోన్లను అధికారిక డిపాజిట్ కేంద్రాల్లో భద్రపరచి, టోకెన్ ఆధారంగా తిరిగి పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ కల్పిస్తున్న ఈ సేవల ద్వారా భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం పొందుతున్నారు.
