తిరుమల : కోట్లాది మంది భక్తులను కలిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. కొత్త సంవత్సరం సందర్భంగా ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వీబీసీ భక్తి ఛానల్ తో పాటు కొత్త ఛానల్ కూడా ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని ప్రకటించారు ఆలయ ముఖ్య కార్య నిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్. టీటీడీ ఆలయాల ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి వర్చువల్ రియాలిటీ మద్దతు తీసుకోవాలని సూచించారు. ఎస్వీబీసీ ద్వారా స్థానిక , అనుబంధ ఆలయాల సేవలు, ఆచారాలకు విస్తృత ప్రచారం కల్పించాలని స్పష్టం చేశారు. స్థానిక , అనుబంధ ఆలయాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు అనిల్ కుమార్ సింఘాల్
టీటీడీ స్థానిక , అనుబంధ ఆలయాల ప్రాముఖ్యతను భక్తులకు తెలియ జేయడానికి వర్చువల్ రియాలిటీ (VR) మద్దతును పరిశీలించాలని టీటీడీ కార్య నిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఆయన టీటీడీ సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. కీలక సూచనలు చేశారు. టీటీడీ స్థానిక , అనుబంధ ఆలయాల ప్రాముఖ్యత, వాస్తుశిల్ప సౌందర్యం, ఇతర ముఖ్యమైన అంశాలను భక్తులకు సమర్థవంతంగా తెలియ జేయడానికి, అవసరమైతే ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) సాంకేతికతను ఉపయోగించడాన్ని కూడా పరిశీలించవచ్చని అన్నారు.



















