చిన్నారుల పురోగ‌తి ద‌శ‌ల‌పై ఛార్జ్ లు రూపొందించాలి

స్పష్టం చేసిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం జేఈవో శ‌ర‌త్

newsseals-JEOSharath

తిరుప‌తి : టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర శ్రవణం సంస్థలో శిక్షణ పొందుతున్న చిన్నారుల పురోగతి దశలపై ఛార్ట్ లు రూపొందించాలని టిటిడి జేఈవో (హెల్త్ అండ్ ఎడ్యుకేషన్) డా. ఎ. శరత్ అధికారులకు సూచించారు. శ్రవణం ప్రాంగణాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడారు. వినికిడి లోపం గల పిల్లలు శ్రవణంలో చేరగానే వీడియో రికార్డ్ చేసి, తదుపరి శిక్షణ, శిక్షణ అనంతరం వెలుపలికి వెళ్లే అంశాలను వీడియో తీసి పిల్లల సంరక్షకులకు ఇస్తే వారిలో మరింత ఆనందం కన్పిస్తుందని అన్నారు.

0 – 5 వయసు పిల్లలకు శిక్షణలో వివిధ దశల పురోగతి కనిపించేలా శ్రవణం ప్రాంగణంలో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు డాక్ట‌ర్ శ‌ర‌త్. శ్రీవారి దీవెనలతో శ్రవణం సంస్థ నడుస్తోందని వారికి ఆధునిక పద్దతుల ద్వారా మరింత ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని స్ప‌ష్టం చేశారు. టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు, టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచనలతో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

ముందుగా శ్రవణంలో పిల్లలకు శిక్షణ, ఏర్పాట్లు, సదుపాయాలను ఆయన పరిశీలించారు. శిక్షణలో ఉన్న పిల్లలతో ముచ్చటించారు. పిల్లలకు బోధిస్తున్న బోధనా పద్దతులను దగ్గరుండి పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మరింత సరళమైన పద్దతుల ద్వారా శిక్షణ ఇవ్వాలన్నారు. అనంతరం పిల్లల తల్లులతో సమావేశం నిర్వహించారు. శ్రవణంలో చేరాక పిల్లల మాటల ఉచ్చరణ, మాటలను అర్థం చేసుకునే సామర్థ్యంలో పురోగతి ఉందా అని తెలుసుకున్నారు. పిల్లలకు శిక్షణ చాలా బావుందని వారి తల్లులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Exit mobile version