తిరుమల : దేశంలోనే తొలిసారిగా ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దిశా నిర్దేశం చేసే దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం చుట్టినట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు వెల్లడించారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విశిష్ట ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం ప్రాచీన, ఆగమ శాస్త్రాలకు అనుగుణమైన హిందూ దేవాలయాల్లో అత్యంత ప్రాముఖ్యమైన ధ్వజ స్తంభాల నిర్మాణానికి అవసరమైన దివ్య వృక్షాలను టీటీడీ స్వయంగా పెంచి, పరిరక్షించి వినియోగించడమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రూపొందించిన తిరుమల అభివృద్ధి లక్ష్యాలకు పూర్తిగా అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉంటుందని చెప్పారు. బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు.
సంప్రదాయాల పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే బాధ్యతాయుత పాలనకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ధ్వజ స్తంభం కేవలం నిర్మాణాత్మక అంశం మాత్రమే కాదన్నారు. అది భౌతిక లోకానికి, దైవ లోకానికి మధ్య ఉన్న శాశ్వత బంధానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ఆలయ ప్రాంగణంలో నిటారుగా నిలిచి ఉండే ధ్వజ స్తంభం భక్తి, పవిత్రత, దైవ సన్నిధిని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఆగమ శాస్త్రాల ప్రకారం, ధ్వజ స్తంభం నిటారుగా పెరిగిన ఒకే చెట్టుకు చెందిన పవిత్ర వృక్ష కాండంతో తయారు చేయాలన్నారు. ఆ వృక్షాన్ని ఆధ్యాత్మిక, జ్యోతిష్య, విధి విధానాలకు అనుగుణంగా ఎంపిక చేసి, సంవత్సరాల తరబడి సంరక్షించి, ఆపై శాస్త్రోక్తంగా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం వినియోగిస్తారని చెప్పారు బీఆర్ నాయుడు.



















