TTD EO Shyamala Rao : తిరుపతి – అన్నమయ్య కీర్తనలను విశ్వ వ్యాప్తం చేసేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలోని అన్ని ధార్మిక ప్రాజెక్టుల పని తీరుపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో (TTD EO Shyamala Rao) మాట్లాడారు. అన్నమయ్య కీర్తనలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర స్థాయి కాంపిటీషన్లు నిర్వహించాలని, అందుకు ముందస్తుగా ఆడిషన్లు చేపట్టాలని సూచించారు.
TTD EO Shyamala Rao Key Comments
అదే విధంగా అన్నమయ్య సాహిత్యాన్ని కళాశాలలు, విశ్వ విద్యాలయలలో పరిశోధనలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పిల్లలకు, యువత లో అన్నమయ్య కీర్తనలు పట్ల మక్కువ పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు రూపొందించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సరి కొత్త కార్యక్రమాలను ప్రారంభించాలని స్పష్టం చేశారు ఈవో జె. శ్యామల రావు.
హరికథకు పూర్వ వైభవం తీసుకు రావడానికి ఈ నెల 31న నిర్వహించబోయే ”హరికథ వైభవం” కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ప్రాజెక్ట్ కు ఈవెంట్స్ తో కూడిన వార్షిక క్యాలెండర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని టీటీడీ ఆలయాలలో క్రమం తప్పకుండా సాంస్కృతిక, ఆధ్యాత్మిక , భక్తి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు ఈవో. గిరిజన ప్రాంతాలలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు.
ఎస్‌వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ద్వారా అన్నమయ్య కీర్తనలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి యువతకు చేరువ చేయాలని తెలపారు. ఈ సమీక్షా సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం, ఇతర ప్రాజెక్టుల అధికారులు పాల్గొన్నారు.
Also Read : CM MK Stalin Important Letter : కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై స్టాలిన్ లేఖ
