వాహనాలలో భ‌క్తి పాట‌లు వినిపించేలా ఏర్పాట్లు

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో

hellotelugu-TTDEOAnilKumarSinghal

తిరుమ‌ల‌, 2025 డిసెంబ‌ర్ 05: తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా 23 మంది భ‌క్తులు త‌మ స‌ల‌హాలు, సూచ‌న‌లు అందించారు.

1. దుర్గా ప్రసాద్, భీమవరం.

ప్రశ్న: ఆన్ లైన్ లో దివ్యాంగులకు, వృద్ధులకు ఒకే స్లాట్ ఇవ్వడంతో టోకెన్లు బుక్ చేసుకోలేక పోతున్నాం. ఆఫ్ లైన్ ద్వారా దివ్యాంగులకు టోకెన్లు కేటాయిస్తే బాగుంటుంది.

ఈవో: అన్ని వర్గాలవారినీ దృష్టిలో పెట్టుకుని ఆన్ లైన్ లో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది‌.

2. శ్రీనివాసులు, హైదరాబాద్.

ప్రశ్న: నాది నీరాజనం వేదికపై భార‌తం, రామాయ‌ణం, అన్న‌మ‌య్య కీర్త‌న‌ల‌ను ప‌ఠించే కార్య‌క్ర‌మాలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోండి.

ఈవో: దీనిపై అధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలో నిర్ణయం తీసుకుంటాం.

3. ప్రవీణ్, చిత్తూరు.

ప్రశ్న: స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవ‌ల‌ను తిరుమ‌ల‌లో నిలిపి వేశారు. స్వామివారి సేవ‌కు అవ‌కాశం క‌ల్పించండి.

ఈవో: ప‌రిశీలిస్తాం.

4.శర్మ, ఢిల్లీ.

ప్రశ్న: రూ.లక్ష విరాళంగా ఇచ్చిన దాతలకు దర్శనాలు దొరకడం లేదు.

ఈవో: మూడు నెలలు ముందుగా దాతల కోటాను ఆన్ లైన్ లో విడుదల చేస్తాం.

5. శ్రీనివాస్, చెన్నై.

ప్రశ్న: వృద్ధులు, దివ్యాంగుల‌ దర్శన టోకెన్లు ఆన్ లైన్ లో దొరకడంలేదు. రూ.300 దర్శన టికెట్లను తగ్గించి ఆ టికెట్లను వృద్ధులు, వికలాంగులకు కేటాయిస్తే బాగుంటుంది.

ఈవో: లక్షలాదిమంది భక్తులు టికెట్ల కోసం ప్రయత్నించడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కోటాను పెంచుతూ పోతే క్యూలైన్ల నిర్వహణ కష్టతరమవుతుంది. ఎక్కువ మంది భక్తులకు మేలు చేసేవిధంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది.

6. రవి, రాజమండ్రి

ప్రశ్న: కరోనా సమయంలో తిరుమలలో గరుడ పురాణం చెప్పారు. దానిని పునరుద్ధరిస్తే బాగుంటుంది‌.

ఈవో: పరిశీలిస్తాం.

7. శివ శంకర్, విశాఖపట్నం.

ప్రశ్న: టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు గోవిందా అని భక్తులను సంభోదించేలా చర్యలు తీసుకోండి‌.

ఈవో: ఇప్పటికే అమలు చేస్తున్నాం.

8. సందీప్, వనపర్తి.

ప్రశ్న: గోవింద కోటి రాసిన వారందరి పేర్లను ప్రచారం క‌ల్పిస్తే బాగుంటుంది.

ఈవో: పరిశీలిస్తాం.

9.చంద్రశేఖర్, తిరుపతి.

ప్రశ్న: వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో తిరుపతి స్థానికులకు అన్యాయం జరిగింది. చివరి మూడు రోజులు కాకుండా మొదటి మూడు రోజులు దర్శనాలు కల్పించి ఉంటే బాగుంటుంది.

ఈవో: వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు పవిత్రమైనవే. అన్ని రోజులు సమానంగా భావించి స్థానికులు దర్శనం చేసుకోవాలి. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని స్థానికులకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతోనే చివరి మూడు రోజుల్లో స్థానికులకు కేటాయించాం. స్థానికులపై చిన్న చూపు లేదు.

10. రామ్ మోహన్, తెలంగాణ.

ప్రశ్న: వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఆన్ లైన్ లో కేటాయించడం చాలా మంచి ఆలోచన. మధ్యాహ్నం సమయంలో శ్రీవారి మెట్టు వైపు చిన్న పిల్లలను అనుమతించడం లేదు. ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అనుమతిస్తే బాగుంటుంది.

ఈవో: శ్రీవారి మెట్టు మార్గంలో వ‌ణ్య ప్రాణుల‌కు ఇబ్బంది లేకుండా భక్తులకు భద్రతా కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.

11. సువర్ణ, హైదరాబాద్.

ప్రశ్న: అన్న ప్రసాద కేంద్రంలో వృద్ధులతో వెళ్లినప్పుడు వెయిటింగ్ టైమ్ ఎక్కువగా ఉంది. పరిశీలించి చర్యలు తీసుకోగలరు.

ఈవోః ప‌రిశీలించి చ‌ర్య‌లు చేప‌డ‌తాం.

12. నాగార్జున, నంద్యాల.

ప్రశ్న: గోవిందమాల భక్తులకు కూడా వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది.

ఈవో: అన్ని వ‌ర్గాల భ‌క్తుల‌ను దృష్టిలో పెట్టుకుని ప‌ది రోజుల వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు ఏర్పాట్లు చేశాం. గోవిందమాల భ‌క్తులు కూడా జ‌న‌వ‌రి 2 నుండి 8వ తేది వ‌ర‌కు స‌ర్వ ద‌ర్శ‌నంలో స్వామి వారిని ద‌ర్శించుకోవ‌చ్చు.

13. రాజ్య లక్ష్మి, హైదరాబాద్.

ప్రశ్న: మాకు లక్కీ డిప్ లో అంగ ప్రదక్షిణ టోకెన్లు వచ్చాయి. కానీ మాకు 60 ఏళ్లు కావడంతో అంగ ప్రదక్షిణ చేయగలమా.

ఈవో: స్వామివారి కృప‌తో మీకు అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా సంతోషం. అంగ ప్ర‌ద‌క్షిణ చేయ‌డం పూర్తిగా మీ వ్య‌క్తిగతం.

14. ప్రీతి, చెన్నై.

ప్రశ్న: ఆల‌యంలో ద‌ర్శ‌న స‌మ‌యంలో సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు భ‌క్తుల‌ను నెట్టేస్తున్నారు. ఏకాదశి రోజున భక్తులందరూ ఉపవాసం ఉంటారు. అందుకు తగిన విధంగా ప్రసాదాలు పంచితే బాగుంటుంది.

ఈవో: భ‌క్తులంద‌రికీ ఎక్కువ‌సేపు స్వామి వారిని చూడాల‌ని ఉంటుంది. కానీ స్వామి వారి దర్శ‌నం కోసం భ‌క్తులు గంట‌ల‌కొద్దీ వేచి ఉంటారు. స్వామి స‌న్నిధిలో భ‌క్తుల‌కు తోపులాట లేకుండా శ్రీ‌వారి సేవ‌కుల‌కు శిక్ష‌ణ ఇస్తాం. ఆలయ సాంప్రదాయం ప్రకారం మాత్ర‌మే అన్న‌ ప్రసాదాలు భ‌క్తుల‌కు అందిస్తున్నాం. మీ సూచనను పరిశీలిస్తాం.

15. గోపాల్, తిరుపతి.

ప్రశ్న: రూ.300 దర్శనాల్లో కంపార్ట్మెంట్ లో కూర్చోబెడుతున్నారు. దర్శన సమయం ముందుగానే తెలిసే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. క్యూ లైన్లలో అన్న ప్రసాదాలు ఇవ్వడం వల్ల భక్తులు వృధా చేస్తున్నారు.

ఈవో: దర్శన సమయం తెలిసేలా డిస్ల్పేలు ఏర్పాటు చేస్తాం. VQC క్యూలైన్ల‌లో భ‌క్తులు అన్న ప్ర‌సాదం వృధా చేయ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం.

16. శ్రీనివాస్, తిరుపతి.

ప్రశ్న: తిరుమలకు వచ్చేటప్పుడు ట్యాక్సీ ల్లో సినిమా పాటలు పెడుతున్నారు. ప్ర‌యాణ స‌మ‌యంలో గోవిందనామ స్మరణ చేసేలా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తిరుమలలో గోవింద నామావళి బోర్డులు కనిపించడం లేదు. మాడ వీధుల్లో భక్తులు పాదరక్షలతో తిరుగుతున్నారు.

ఈవో: మీ సూచనలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

17. గోపాల్ రెడ్డి, తిరుపతి

ప్రశ్న: ఎస్వీయూ క్యాంపస్ లో లైట్లు సరిగ్గా పని చేయడం లేదు.

ఈవో: చర్యలు తీసుకుంటాం.

18. వెంకటేశ్వరరావు, ఏలూరు‌.

ప్రశ్న: స్థానిక క‌ల్యాణ మండ‌పాన్ని ఆధునీక‌రించి శ్రీ‌నివాస క‌ల్యాణాల‌ను పున‌రుద్ధ‌రిస్తే బాగుంటుంది. వృద్ధులు, దివ్యాంగుల కోటాను పెంచండి.

ఈవో: క‌ల్యాణ మండ‌పం ఆధునీక‌ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటాం. వృద్ధులు, దివ్యాంగుల కోటా పెంచితే ఇత‌ర భ‌క్తులు ఇబ్బంది ప‌డ‌తారు.

19. దీప, తిరుపతి.

ప్రశ్న: మా భర్త టీటీడీ ట్రస్టులకు రూ.74 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆయన మృతి చెందడంతో ఇప్పుడు దర్శనాల ప్రివిలేజ్ మాకు వర్తిస్తుందా.

ఈవో : మా అధికారులు మిమ్మల్ని సంప్రదించి వివరాలు అందిస్తారు.

20. ముని దామోదర్, తిరుపతి.

ప్రశ్న: గోగర్భం దగ్గర ఉన్న చెత్త డంప్ ను శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోండి.

ఈవో: మా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి చర్యలు చేపడుతున్నారు. మీ సూచనలను పరిశీలిస్తాం.

21. వెంక‌ట ర‌మ‌ణ‌మూర్తి, హైదరాబాద్.

ప్రశ్న: ద‌ర్శ‌నానంత‌రం హుండీ వ‌ద్ద ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంది. రూ.300 దర్శన టికెట్ బుక్ చేసుకుని అనివార్య కారణాల వల్ల దర్శనానికి రాకపోతే లడ్డూ ఇవ్వడం లేదు.

ఈవో: సూచ‌న‌ల‌ను పరిశీలిస్తాం.

22.సత్య నారాయణమూర్తి, హైదరాబాద్.

ప్రశ్న: వైకుంఠ ద్వార దర్శనాలకు తొలి మూడు రోజులకు ఆన్ లైన్ లో టోకెన్లు కేటాయించడం చాలా మంచి నిర్ణయం. 2016 నుండి పరకామణి సేవకు వస్తున్నాను. లడ్డూ సేవకు కూడా 65 ఏళ్ల పైబడిన వారికి అనుమతిస్తే బాగుంటుంది.

ఈవో: పరిశీలిస్తాం.

23.మహేశ్వరయ్య, వెంకటగిరి.

ప్రశ్న: నేను దివ్యాంగుడిని, ఇప్పుడు నాకు 64 సంవ‌త్స‌రాలు. రెండు, మూడేళ్లకు మించి బతకను. నాకు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించండి

ఈవో: మీకు శ్రీవారి దయతో దీర్ఘాయుష్షు ఉండాలని ప్రార్థిస్తున్నాను. దివ్యాంగులకు ప్రత్యేకంగా దర్శనం చేసుకునేందుకు ఆన్ లైన్ లో టోకెన్లు విడుదల చేస్తున్నాం. దివ్యాంగుల ద‌ర్శ‌నంపై మా అధికారులు మీకు అవ‌గాహ‌న క‌ల్పిస్తారు.

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో లో అవ‌కాశం రాని భ‌క్తులు ఈ-మెయిల్‌, వాట్సాప్‌, కాల్ సెంట‌ర్‌, సోషియ‌ల్ మీడియా ద్వారా కూడా త‌మ స‌ల‌హాలు, సూచ‌న‌లు అందిస్తే వాటిపై కూడా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని ఈవో తెలియ‌జేశారు.

Exit mobile version