తిరుమల : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు శనివారం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక సూచన చేశారు. ఈనెల 23న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని డిసెంబర్ 23వ తేది మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుందని స్పష్టం చేశారు.
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు ఈవో. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని స్పష్టం చేశారు. ఈ కారణంగా 23వ తేది ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారని తెలిపారు. దీంతో అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేయడం జరిగిందని పేర్కొన్నారు ఈవో.
అదేవిధంగా 23న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందు వల్ల ముందస్తుగా 22వ తేది సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదని స్పష్టం చేశారు అనిల్ కుమార్ సింఘాల్. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా చేశామన్నారు. దర్శనం సజావుగా, సులభంగా అయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
