తిరుపతి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థలలో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయ ట్రస్ట్, శ్రీ వేంకటేశ్వర విద్యా దానం ట్రస్ట్, శ్రీ వేంకటేశ్వర ప్రాణ దాన ట్రస్ట్ లపై టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఈవో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించచుకుంది. టిటిడి విద్యా సంస్థలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు విద్యతో పాటు సనాతన ధర్మం, నైతిక విలువలు, భక్తిభావం, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై బోధన చేయాలన్నారు.
ఇలా చేస్తే వారు ఆదర్శవంతమైన పౌరులుగా తయారయ్యేందుకు వీలు కలుగుతుందన్నారు అనిల్ కుమార్ సింఘాల్. విద్యార్థులకు విద్యా బోధనతో పాటు తరుచుగా క్షేత్ర స్థాయి పరిశీలనకు తీసుకెళ్లాలని అన్నారు. దీని వల్ల వారిలో మరింత విజ్ఞానం పెరుగుతుందని చెప్పారు ఈవో . విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలలో లోపాలను సరిచేసేలా ప్రయోగశాలలు తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు . నైపుణ్యాభివృద్ధికి సంబంధించి నిపుణులతో శిక్షణ, అవసరమైన మౌళిక సదుపాయాలు సమకూర్చాలని స్పష్టం చేశారు అనిల్ కుమార్ సింఘాల్. ఈ కీలక సమావేశంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం హాజరయ్యారు.

















