శాలువాల కొనుగోళ్ల‌లో అక్ర‌మాలపై విచార‌ణ‌

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు

hellotelugu-TTDChairmanBrNaidu

తిరుమ‌ల : టీటీడీలో రోజు రోజుకు అక్ర‌మాల పుట్ట బ‌య‌ట ప‌డుతోంది. మొన్న‌టి దాకా ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి, ప‌ర‌కామ‌ణిలో చేతి వాటం, త‌దిత‌ర అంశాలు భ‌క్తుల‌ను క‌ల‌వ‌ర ప‌రిచేలా చేసింది. తాజాగా మ‌రో స్కాం బ‌య‌ట ప‌డింది. ఇందుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. గ‌త టీటీడీ పాలక మండలి హ‌యాంలో శాలువాల కొనుగోళ్లలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు త‌మ విచార‌ణ‌లో బ‌య‌ట ప‌డింద‌ని టీటీడీ బోర్డు స‌భ్యుడు , ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించార‌ని తెలిపారు. టీటీడీ చైర్మ‌న్ మీడియాతో మాట్లాడారు.

టీటీడీకి 350 రూపాయల విలువైన పట్టు శాలువాను 1350 రూపాయలకు సరఫరా చేసిన‌ట్లు త‌మ విచార‌ణ‌లో తేలింద‌న్నారు. ఇందుకు సంబంధించి భారీ ఎత్తున స్కామ్ చోటు చేసుకుంద‌ని , బ‌ల‌మైన ఆధారాలు కూడా ల‌భించాయ‌న్నారు. ఇందుకు సంబంధించి శాలువాల స్కాం పై ప్రస్తుత పాలక మండలి సమగ్ర విచారణ ప్రారంభించింద‌ని చెప్పారు. ప్ర‌తి ఏటా రూ. 20 కోట్ల విలువైన శాలువాల కొనుగోళ్లను పరిశీలించినప్పుడు, 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ. 80 నుంచి రూ. 90 కోట్ల మేర అవినీతి జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేశామ‌న్నారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు.

శుద్ధమైన తుస్సా పట్టుతో, బంగారం/వెండి జరీతో, సిల్క్ మార్క్ ధృవీకరణతో తయారవ్వాల్సిన శాలువాలను నాసిరకం పట్టుతో సరఫరా చేసిన విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.. దీనిపై బోర్డు చర్చించిన‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు పాల‌క మండ‌లి సూచ‌న‌ల మేర‌కు ఏసీబీ విచార‌ణ‌కు ఆదేశించామ‌న్నారు బీఆర్ నాయుడు. నివేదిక వ‌చ్చిన వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Exit mobile version