TTD : తిరుమల – ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమల నంబి 1052వ అవతార మహోత్సవాన్ని ఆగస్టు 30, 31వ తేదీల్లో తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమల నంబి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీ తిరుమల నంబి ఆలయంలో 16 మంది ప్రముఖ పండితులు శ్రీ తిరుమల నంబి జీవిత (TTD) చరిత్రపై ఉపన్యసించనున్నారు.
TTD Interesting Updates
శ్రీవారి భక్తాగ్రేసరులలో ఒకరైన శ్రీ తిరుమల నంబి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారు. వీరు భగవద్రామానుజుల వారికి స్వయాన మేనమామ, గురుతుల్యులు. వీరు రామానుజుల వారికి రామాయణ పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది.
ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమల నంబికి (Tirumala Nambi) సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. తిరుమలనంబి శ్రీవేంకటేశ్వర స్వామి వారి అభిషేకానికి సంబంధించిన పవిత్ర జలాలను తిరుమల ఆలయానికి 8 కి.మీ దూరంలో ఉన్న పాప వినాశనం తీర్థం నుండి తీసుకొచ్చేవారు. ఒకరోజు ఆయన పాప వినాశనం నుండి నీటిని కుండలో తీసుకొస్తుండగా సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తిరుమలనంబి భక్తిని పరీక్షించాలని భావించి ఒక వేటగాని రూపంలో వచ్చి దాహంగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని ఆడిగారు. ఈ పవిత్ర జలాలు స్వామి వారి ఆభిషేకం కోసమని చెప్పి ఇచ్చేందుకు తిరుమల నంబి తిరస్కరించారు. అంతట వేటగాని రూపంలో ఉన్న స్వామివా రు రాయి విసిరి కుండకు చిల్లు చేసి నీరు తాగారు.
అందుకు తిరుమలనంబి బాధపడుతూ వయోభారం కారణంగా నేను తిరిగి అంత దూరం పాప వినాశనం వెళ్లి స్వామివారికి అభిషేకజలం తీసుకు రావడం సాధ్యం కాదు, ఈ రోజు నేను స్వామి వారికి అభిషేకం చేయలేక పోతున్నా అని దు:ఖించారు. అంతలో వేటగాని రూపంలో ఉన్న స్వామి వారు చింతించకు తాతా నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తా అని తెలిపి తన చేతిలోని విల్లును ఆకాశంలోనికి ఎక్కుపెట్టి బాణం వదిలారు. వెంటనే వినీలాకాశం నుండి ఉరుకుతూ నీటిధార భూమికి వచ్చింది.
ఇకపై ఈ జలాన్నే నా అభిషేకానికి వినియోగించు అని ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామి వారు అదృశ్యమయ్యారు. అప్పుడు తిరుమల నంబి సాక్షాత్తు స్వామి వారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ తీర్థాన్నే స్వామి వారి అభిషేకానికి వినియోగిస్తున్నారు. ఆకాశం నుండి వచ్చినందువల్ల ఈ తీర్థానికి ఆకాశగంగ అని నామధేయం ఏర్పడింది.
Also Read : Venkateswara Pavitra Samarpana Interesting : శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పవిత్ర సమర్పణ



















