హైదరాబాద్ : శివ భక్తులకు తీపి కబురు చెప్పింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ). ఈ మేరకు గురువారం కీలక ప్రకటన చేశారు. మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భక్తులకు , ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో భాగంగా పండుగ సందర్బంగా 2,243 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. భక్తులకు సజావుగా ప్రయాణం ఉండేలా ఆర్టీసీ సంస్థ మహా శివరాత్రికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43 శైవ పుణ్యక్షేత్రాలకు ఈ స్పెషల్ బస్సులు నడుస్తాయని తెలిపారు.
ఫిబ్రవరి 14 నుండి 16 వరకు శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, కాళేశ్వరానికి 71 బస్సులతో ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించారు ఎండీ నాగిరెడ్డి. కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప వంటి ప్రధాన దేవాలయాలకు అదనపు సర్వీసులు కూడా నడుస్తాయని స్పష్టం చేశారు.
సాధారణ ఛార్జీలకు 1.5 రేట్ల వరకు సవరించిన ఛార్జీలు ప్రత్యేక సర్వీసులకు మాత్రమే వర్తిస్తాయని తెలిపారు. సాధారణ సర్వీసులు మారని ఛార్జీలతో కొనసాగుతాయన్నారు. రాష్ట్ర పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని చెప్పారు. హైదరాబాద్-శ్రీశైలం ప్రత్యేక బస్సుల ముందస్తు బుకింగ్‌లు [www.tgsrtcbus.in](http://www.tgsrtcbus.in)లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వివరాల కోసం, ప్రయాణికులు 040-69440000, 040-23450033 నంబర్‌లను సంప్రదించాలని కోరారు ఎండీ.

















