తిరుపతి జిల్లా : మహా శివరాత్రి సందర్బంగా ఏపీలోని శివాలయాలు భక్తులతో నిండి పోయాయి. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా తిరుపతి జిల్లాలో పేరు పొందిన శ్రీకాళహస్తి పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో నిండి పోయింది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మొత్తం 1156 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా దర్శనం సజావుగా జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు స్వయంగా ఎస్పీ సుబ్బారాయుడు.
డ్రోన్ కెమెరాల ద్వారా అనునిత్యం నిఘా కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్బంగా చెప్పారు ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయంతో పాటు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలను పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు ఎస్పీ సుబ్బారాయుడు. భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని, సూచనలు పాటించి, మహాశివరాత్రి వేడుకలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించు కోవాలని కోరారు.



















