Tirupati : తిరుపతి జిల్లా : ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో తిరుపతి (Tirupati) జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బ రాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమై విస్తృత భద్రతా చర్యలు చేపట్టారు. ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, ఆలయాలు, ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు, వాణిజ్య కేంద్రాలు, రద్దీ ప్రాంతాలు వంటి ప్రదేశాలలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాల సహకారంతో క్షుణ్ణoగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Tirupati Alert after Red Fort Bomb Blast
ప్రధాన దేవాలయాలు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు.
రైల్వే ప్లాట్‌ఫారాలు, బస్టాండ్లు, షాపింగ్ కేంద్రాలు, పార్సిల్ కార్యాలయాలు వంటి ప్రదేశాలను బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఏఆర్ (సాయుధ దళం) ,స్థానిక పోలీసులు కలిసి సమగ్రంగా తనిఖీ చేశారు. జిల్లా సరిహద్దుల్లో ప్రతి వాహనాన్ని చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టంగా తనిఖీ చేస్తున్నారు . అనుమానాస్పద వాహనాలు, వదిలి వేయబడిన వస్తువులు, వ్యక్తుల కదలికలపై నిఘా మరింతగా పెంచారు.
అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా వాహనాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కి లేదా 112 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. ప్రజలలు భయపడకుండా పోలీసు శాఖ చేపడుతున్న భద్రతా చర్యలకు సహకరించాలని సూచించారు. ఇదిలా ఉండగా నిన్న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలిన ఘటనలో 8 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కేంద్ర సర్కార్ ఈ ఘటనతో అప్రమత్తమైంది. దేశంలోని ప్రధాన నగరాలను అప్రమత్తం చేసింది కేంద్ర హోం శాఖ. ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా కీలక మీటింగ్ నిర్వహించారు.
Also Read : Hydraa Sensational : ముమ్మరంగా తమ్మిడికుంట పునరుద్ధరణ

















