తిరుపతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బా రాయుడు ఉన్నతాధికారులతో ప్రధాన అంశాలపై కమాండ్ కంట్రోల్ కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం భక్తుల భారీ రద్దీకి అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసే విధంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించలని ఆదేశాలు జారీ చేశారు.
వైకుంఠ ద్వార దర్శనాల కారణంగా తిరుమలలో భారీగా పెరగనున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ వ్యవస్థ, లైన్ మేనేజ్‌మెంట్, అత్యవసర స్పందన బృందాల నియామకం, పాదచారి మార్గాల భద్రత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. కుటుంబాలతో వచ్చే చిన్నపిల్లలు తప్పిపోకుండా ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు, చైల్డ్ మిస్సింగ్ టీమ్స్‌ను అదనంగా ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు. భక్తుల గమనం సాఫీగా ఉండేలా అడుగు మార్గాలు, కలెక్టర్‌తో సమన్వయం, టిటిడి విజిలెన్స్‌తో కలిసి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ పవిత్ర ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం తిరుమల ప్రాంతంలో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించామని, సీసీటీవీ పర్యవేక్షణను బలోపేతం చేశామని ఎస్పీ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే క్విక్ రెస్పాన్స్ టీమ్స్, హెల్త్ సపోర్ట్, అంబులెన్స్ మార్గాలు, ఫైర్ సర్వీసెస్‌తో సమన్వయం వంటి అంశాలను కూడా సమీక్షించారు. భక్తుల సౌకర్యం, భద్రత, శాంతి భద్రతలే పోలీసు శాఖకు అత్యంత ప్రాముఖ్యం అని, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లా మొత్తం పోలీసు బలగాలు అప్రమత్తంగా పని చేస్తాయని సుబ్బారాయుడు స్పష్టం చేశారు.



















