హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వల్లనే నేడు టిమ్స్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించాలనే గొప్ప ఆశయంతో కేసీఆర్ నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి, ఎటువంటి జాప్యం లేకుండా ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ నలుమూలలా ఎయిమ్స్ తరహాలో టిమ్స్ ఆసుపత్రులు ఉండాలనే ఉన్నత లక్ష్యంతో కేసీఆర్ వాటికి శంకుస్థాపన చేయడమే కాకుండా, బీఆర్ఎస్ హయాంలోనే నిర్మాణ పనులను వేగవంతం చేశారని గుర్తు చేశారు.
కేవలం సనత్ నగర్ టిమ్స్‌లోనే 1,000 పడకలు, 300 ఐసీయూ పడకలు, 16 ఆపరేషన్ థియేటర్లు, అవయవ మార్పిడి విభాగం, ఎంఆర్‌ఐ , సీటీ స్కాన్, ఎక్స్-రే, క్యాత్ ల్యాబ్స్, రేడియాలజీ, డయాలసిస్ కేంద్రం , అన్ని రకాల వైద్య విభాగాలు ఒకే చోట అందుబాటులో ఉండటం రోగులకు ఒక అమూల్యమైన వరం అని పేర్కొన్నారు కేటీఆర్. ఈ సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి కేవలం హైదరాబాద్ నగరవాసులకే కాకుండా, ప్రాణాపాయ స్థితిలో జిల్లాల నుండి రాజధానికి వచ్చే రోగులకు కూడా ఒక జీవనాడిలా ఉపయోగ పడుతుందని తెలిపారు.
విశాలమైన 22 ఎకరాల ప్రాంగణంలో నిర్మించిన ఈ ఆసుపత్రి నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లకు, అలాగే ఇక్కడ సేవలు అందించనున్న వైద్యులు, నర్సింగ్ , ఇతర సిబ్బందికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. ప్రాథమిక వైద్య సేవల కోసం బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన 350 బస్తీ దవాఖానాలతో పాటు, ఆక్సిజన్ సదుపాయం కలిగిన 4,000 సాధారణ పడకలు , 1,200 అత్యవసర పడకలు పేద రోగులకు ఎంతో భరోసానిస్తాయన్నారు. కేసీఆర్ కి మంచి పేరు వస్తుందనే రాజకీయ కక్షతో వీటిని ఇంతకాలం జాప్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి అల్వాల్ , ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రులను త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు.
అదేవిధంగా తెలంగాణలోనే అతిపెద్దదైన 2,000 పడకల వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని, అలాగే హైదరాబాద్‌లోని నిమ్స్ విస్తరణ పనులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల తరఫున త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.















