విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ కీలక ప్రకటన చేశారు. ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. అయినప్పటికీ నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక విద్యుత్ పరికరాలను పరిశీలించి అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్ర పరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందించడం జరుగుతోందన్నారు. అదే విధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు . ఈవీఎం, వీవీప్యాట్ల గోదాము తనిఖీలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహంతో పాటు ఏదుపాటి రామయ్య (తెదేపా), వై.ఆంజనేయ రెడ్డి (వైఎస్ఆర్‌సీపీ), మురళీకృష్ణ (ఐఎన్‌సీ), జడగం శ్రీనివాసరావు (జనసేన పార్టీ) తదితరులు పాల్గొన్నారు.















