తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. ఈనెల 20వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్ప స్వామి వారి మోహినీ అవతార వాహనసేవలో జాతీయ సాంస్కృతిక కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 16 కళాబృందాల్లోని 451 మంది కళాకారులు తిరుమాడ వీధుల్లో ప్రదర్శనలు ఇస్తూ భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటి చెప్పారు. ఉత్తరాఖండ్ కళాకారుల పర్వత ప్రాంత మహిళల వ్యవసాయ శ్రమను ప్రతిబింబించే జానపద నృత్యం, కర్ణాటక కళాకారుల మహిళా డొల్లుకుణిత, తెలంగాణ రాజ్ గోండ్ తెగ కళాకారుల గుస్సాడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తరప్రదేశ్ కళాకారుల కజరీ నృత్యం, శ్రీరాముడి వేషధారణలో ఆంధ్రప్రదేశ్ చిన్నారులు ప్రదర్శించిన రామాయణ ఘట్టాలు భక్తులను అలరించాయి.
హర్యానా కళాకారుల సంప్రదాయ జానపద నృత్యాలు, మహారాష్ట్రతో పాటు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహిళా కళాబృందాల డ్రమ్ విన్యాసాలు భక్తుల్లో ఉత్సాహాన్ని నింపాయి. శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు భరతనాట్యం, కూచిపూడి, గర్భా నృత్య రూపకాలతో మోహినీ అవతార వైభవాన్ని కళాత్మకంగా ఆవిష్కరించారు. మోహినీ అవతార వాహన సేవలో ప్రతిభ కనబరిచిన నాలుగు కళా బృందాలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. గుజరాత్కు చెందిన అజిత్ త్యాగి బృందం గర్భా నృత్యం, ఆంధ్రప్రదేశ్కు చెందిన పి. నాగబాబు బృందం గరగల్లు, ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన కరంవీర్ సింగ్ బృందం కజరీ నృత్యం, కర్ణాటకకు చెందిన ఎస్. స్వప్న బృందం మహిళా డొల్లుకుణిత ప్రదర్శనలతో విశేషంగా ఆకట్టుకున్నాయి.
వివిధ రాష్ట్రాల జానపద కళారూపాలు, సంప్రదాయ నృత్యాలు ఒకే వేదికపై ప్రదర్శితమవడంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత శోభాయమానమైంది. శ్రీవారి వాహన సేవలో భక్తితో పాటు భారతీయ సంస్కృతి వైవిధ్యాన్ని ఆస్వాదించే అరుదైన అవకాశాన్ని ఈ ప్రదర్శనలు భక్తులకు అందించాయి.


















