Tholi Ekadashi : ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి, తొలి ఏకాదశిగా హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం కాగా, చాతుర్మాసం మొదలయ్యే రోజు కూడా ఇదే కావడం విశేషం. ఈ ఏడాది జూలై 6, 2025 ఆదివారం నాడు తొలి ఏకాదశి (Tholi Ekadashi) ఉత్సవం జరుపుకుంటున్నారు.
Tholi Ekadashi 2025 Special
ఈ రోజునుంచి కార్తిక మాసం వరకు నాలుగు నెలలపాటు శ్రీ మహావిష్ణు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణ కధనాలు చెబుతున్నాయి. ఈ దశను ‘చాతుర్మాసం’గా పిలుస్తారు. సూర్యుడు దక్షిణాయనంలోకి ప్రవేశించడంతో ఈ పర్వదినానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత పెరుగుతుంది.
భక్తులు ఈరోజు ఉపవాసం చేస్తూ, జాగరణతో పాటు శ్రీహరిని స్మరిస్తారు. ఉపవాసం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగి, శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఇదే రోజున కుచేలుడు శ్రీకృష్ణుని దర్శించుకుని తన దరిద్రాన్ని పోగొట్టుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.
సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయని మనకు తెలిసిందే. అయితే, ఆషాఢ శుద్ధ ఏకాదశి లేదా హరిశయని ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఏకాదశిని “పద్మ ఏకాదశి”, “దేవశయని” అనే ఇతర పేర్లతో కూడా పిలుస్తారు.
పురాణాల ప్రకారం, భక్తులు దశమి రాత్రి నుంచే ఆహారాన్ని వదిలి ఉపవాసంలో ఉండటం ప్రారంభిస్తారు. ద్వాదశి ఉదయం విష్ణుపూజ అనంతరం తీర్థ ప్రసాదం స్వీకరించి ఉపవాసాన్ని విరమిస్తారు. ఇది శరీరాన్ని శుద్ధి చేయడమే కాకుండా ఇంద్రియాలను నియంత్రించేందుకు దోహదపడుతుందని పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
ఈ రోజున పంచేంద్రియాల నియంత్రణకు ఉపవాసం ఒక సాధనంగా పనిచేస్తుంది. మనస్సును స్థిరపరచి ఆధ్యాత్మిక చింతనకు దోహదం చేస్తుంది. పైగా, ఉపవాసం శరీరంలోని జీర్ణక్రియను మెరుగుపరచి ఆరోగ్యాన్ని పెంచుతుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు, శరీరం ఉల్లాసంగా మారుతుంది.
తొలి ఏకాదశి (Tholi Ekadashi) సందర్భంగా పేలాలు, బెల్లం, యాలకులు కలిపి తినే ఆచారం కూడా ఉంది. ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేయడమే కాకుండా శక్తిని కూడా అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఇలా ఉపవాసం, పూజలు, ఆచారాలతో పాటు, ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడే విధంగా తొలి ఏకాదశి మహోత్సవాన్ని ఎంతో శ్రద్ధగా జరుపుకుంటున్నారు భక్తులు.
Also Read : PM Modi Special Wishes : దలైలామా కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు



















