చెన్నై : తమిళనాడు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు ప్రముఖ నటుడు కార్తీ. తాజాగా జరిగిన సినీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత మూడేళ్లుగా నా అభిమానులకు సరైన సినిమాని అందించలేక పోయానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ ఈసారి ‘సర్దార్ 2’తో ఘనమైన రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాం అని ప్రకటించారు హీరో కార్తీ. ఈ సందర్బంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. చెన్నైలో జరిగిన ‘సర్దార్ 2’ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. తమిళ స్టార్ హీరో కార్తీ తన గత చిత్రాల ఫలితాలు , రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి ఆసక్తికరమైన, నిజాయితీతో కూడిన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతం కోలీవుడ్ లో నటుడు కార్తీ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. అభిమానుల అంచనాలు అందుకోలేక పోవడం పట్ల స్పందించాడు నటుడు. రాజు మురుగన్‌తో కలిసి ఒక మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతో ‘జపాన్’ చేశానని చెప్పాడు. అది ‘ఆవేశం’ లాంటి విజయాన్ని సాధిస్తుందని అనుకున్నాను, కానీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని అన్నారు కార్తీ. నా అభిమానులకు నేను పవర్‌ఫుల్ యాక్షన్ సినిమాల్లో కనిపించడం ఇష్టం. అయినప్పటికీ నేను చేసిన ‘మెయ్యళగన్’ (తెలుగులో ‘సత్యం సుందరం’) చిత్రాన్ని వారు మనస్ఫూర్తిగా ఆదరించారని అన్నారు. ఆ తర్వాత నలన్ కుమారస్వామి లాంటి ప్రతిభావంతుడైన దర్శకుడిని ప్రోత్సహించడానికి ‘వా వాథియార్’ సినిమాను అంగీకరించానని చెప్పారు.
గత మూడేళ్లుగా నా అభిమానులు కోరుకునే స్థాయి సినిమాని వారికి అందించలేక పోయానన్న అసంతృప్తి నాలో ఉండేదన్నాడు నటుడు కార్తీ. కానీ ఈసారి ‘సర్దార్ 2’ కోసం తాము ఏమాత్రం వెనుకాడకుండా కృషి చేశాం అన్నారు. పూర్తి స్థాయి ఉత్సాహంతో సిద్ధమయ్యామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ సెప్టెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
